కేరళలోని శబరిమలకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి ఏటా అయ్యప్ప భక్తులు మూడు నెలల పాటు స్వామిని దర్శించుకుంటారు. కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్ అయినా కూడా శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఈ ఏడాది కూడా శబరిమల ఆలయానికి రూ.330 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. జనవరి 20వ తేదితో వార్షిక తీర్థయాత్ర ముగియనుండటం వల్ల ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు ఆదాయ వివరాలను తెలిపింది.
జనవరి 14వ తేది వరకూ శబరిమల కొండ ఆలయానికి ఇది వరకూ ఎప్పుడూ లేనంతగా గరిష్టంగా రూ.320 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ రికార్డు 2018లో వచ్చిన రూ.260 కోట్లపై ఉండేది. అయితే కరోనా వల్ల రెండేళ్లపాటు శబరిమల తీర్థయాత్ర సరిగా సాగలేదు. తాజాగా మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప భక్తులు కొండకు తరలివచ్చారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ఆదాయం భారీగా పెరిగింది.