సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 22న నిర్వహించే పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్కు చెందిన భక్తులు మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.
హైదరాబాద్ భక్తులు మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో చేపడతారు. పట్నం వారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆ దీక్షలు విరమిస్తారు. స్వామి వారితో పాటు పట్నం వేసి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తారు. పట్నం వారానికి 50వేలకు పైగా భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.