టునీషియా(tunisia) సమీపంలో వలసదారులతో వెళుతున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 25 మంది ఆఫ్రికన్ వలస దారులు మృతి చెందారు. మరో 15 మంది గల్లంతయ్యారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగింది. 72 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. బుధవారం పది మృతదేహాలను కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెలికితీశారు.
బోటు కింద చిక్కుకుపోయిన 15 మంది మృత దేహాలను గురువారం వెలికితీశారు. బాధితులంతా ఆఫ్రికాలోని సబ్-సహారాకు చెందినవారని అధికారులు తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం మధ్యధరా సముద్రం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గం అని తెలిపింది.
అయితే మధ్యధర సముద్రాన్ని దాటి ఐరోపా దేశాలకు చేరేందుకు వలసదారులను స్మగ్లర్లు చిన్న పడవల్లో తరలిస్తుంటారు. దాంతో వారు సముద్రం దాటుతుండగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వందలాది మంది సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోతుంటారు.