ఓ 8 నెలల పాప ఇంట్లో ఉంటే బుడిబుడి అడుగులు వేసుకుంటూ సందడి చేస్తుంటుంది. పాల బుగ్గల నవ్వులతో చేసే సరదా అంతా ఇంత కాదు. ఆ వయసులో తల్లిదండ్రులను గుర్తుపట్టడం తక్కువనే చెప్పాలి. అయితే హైదరాబాద్‌కి చెందిన ఓ చిన్నారి అందరికీ భిన్నంగా ఉంది. 8 నెలలకే అద్భుతమైన గ్రాహకశక్తితో నోబెల్ ప్రపంచ రికార్డ్ (Noble World record) సాధించింది. మల్కాజిగిరి బలరాం నగర్‌కి చెందిన అధ్యశ్రీ (Adhyasri) పేరు ఇప్పుడు గిన్నిస్ రికార్డుకెక్కింది.
లక్ష్మీ ప్రసన్న, మణికంఠ దంపతులకు 8 నెలల కుమార్తె అధ్యశ్రీ (Adhyasri) ఉంది. పుట్టినప్పటి నుంచి ఆ పాప ఎంతో యాక్టివ్‌గా ఉండటమే కాదు అద్భుతమైన గ్రాహక శక్తి ఉందని తల్లిదండ్రులు గుర్తించారు. రెండు నెలల నుంచి ఆ చిన్నారికి తల్లిదండ్రులు శిక్షణ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మూడు నెలల వయసులోకి వచ్చాక పాపకు అనేక రకాల వస్తువులు, ఫోటోలు, దేశాలకు సంబంధించిన జెండాలను చూపిస్తూ శిక్షణ ఇచ్చారు. దీంతో ఆ పాప క్రమంగా వస్తువులను గుర్తు పట్టడం, ఫోటోలను గుర్తించడం అలవాటు చేసుకుంది.
ఇప్పుడు పాప వయసు 8 నెలలు (8 months) కావస్తోంది. ఆ చిన్నారి గ్రాహక శక్తిని చూసి తల్లిదండ్రులే కాదు, స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 8 నెలలకే ఆ పాప సుమారుగా 3 వందల రకాల ఫోటోలను గుర్తించడమే కాకుండా వస్తువులు, పూలు, పళ్లు, కూరగాయలను తేలిగ్గా గుర్తుపడుతోంది. దీంతో తల్లిదండ్రులు పాప గ్రాహక శక్తిని రికార్డ్ చేసి నోబెల్ ప్రపంచ రికార్డు కోసం పంపగా అనేక సంస్థలు చిన్నారికి అవార్డులు, మెడల్స్ ఇచ్చి అభినందించారు. నోబెల్ రికార్డు సాధించిన అధ్యశ్రీని అందరూ ప్రశంసిస్తున్నారు.