CM Kcr..మైనార్టీలకు రూ.లక్ష..? మరీ మిగతా వారేం పాపం చేశారు..?
కేసీఆర్ సర్కార్ మైనార్టీలకు కూడా రూ.లక్ష అందజేస్తోంది. మరీ ఓసీలు, కొందరు బీసీలు, దళితులకు అన్యాయం జరుగుతుంది. దళితులకు దళితబంధు ఉన్నప్పటికీ.. అదీ కొందరికే వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే నెలలో ఒకటో తేదీన జీతం అనే మాట ఎప్పుడో మరచిపోయారు.
CM Kcr: మైనార్టీలకు కూడా రూ.లక్ష (one lakh) సాయం చేస్తోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే అధికారులు జాబితా సిద్ధం చేయగా.. నేటి నుంచి పంపిణీ చేస్తోంది. దళితబంధు పేరుతో రూ.10 లక్షలు, బీసీలకు రూ.లక్ష.. ఇప్పుడు మైనార్టీలకు మరో లక్ష అందజేస్తోంది. మరీ రాష్ట్రంలో మిగతా సామాజిక వర్గాలు.. ఓసీలు ఏం చేశారనే ప్రశ్న వస్తోంది. వారి గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు..? వారి సంక్షేమం కేసీఆర్ సర్కార్‌కు పట్టదా..? అనే కొశ్చన్స్ వస్తున్నాయి. ఇవీ ముమ్మాటికీ ఓటుబ్యాంక్ రాజకీయాలేనని విపక్షాలు, మేధావులు గొంతు ఎత్తుతున్నారు.
వేల సంఖ్యలో ఆప్లై
బీసీల (bc) లాగానే మైనార్టీలకు వంద శాతం సబ్సిడీతో రుణం అందజేస్తోంది. గతంలో మైనార్టీ కార్పొరేషన్‌కు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. అదీ వందల్లో ఉండగా.. ఇప్పుడు వేల సంఖ్యలో ఆప్లై చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాను ఎన్నికల ముందు ఖాళీ చేస్తున్నారు. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల రెగ్యులర్ నుంచి వీఆర్ఏ (vra) క్రమబద్దీకరణ వరకు అన్నీ రాజకీయ కోణంలో ఉన్నాయి. ఆర్టీసీకి (rtc) చెందిన 40 వేలకు పైగా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం.. తర్వాత రుణమాఫీ కోసం రూ.19 వేల కోట్ల కేటాయింపు.. వీటికితోడు.. దళితబంధు, బీసీలకు రూ.లక్ష సాయం, గృహ లక్ష్మీ పేరుతో రూ.3 లక్షల సాయం అందజేస్తున్నారు.
అగ్రవర్ణాలేం చేశాయి..?
మరో 3 నెలల్లో ఎన్నికలు ఉండగా.. ఏ వర్గాన్ని వదలకుండా నిధులను మంజూరు చేస్తున్నారు. వీరిలో అగ్రవర్ణాలు కొందరు.. బ్రాహ్మణులు, వైశ్యులు ఉన్నారు. జనాభా ప్రాతిపదికన చూస్తే.. వీరి ప్రాధాన్యం తక్కువ. అందుకోసమే వీరిని కేసీఆర్ పట్టించుకోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇటు చూస్తే దళితులకు అన్యాయం జరుగుతుంది.. ఎలా అంటే.. ఓ ఊరిలో కనీసం 50 మంది దళిత కుటుంబాలు ఉన్నా.. ఒకరో.. ఇద్దరికీ దళితబంధు వస్తోంది. రూ.20 లక్షలు ఇవ్వడంతో తమ పని అయిపోయిందని ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. మిగతా కుటుంబాలు మాత్రం వ్యతిరేకతతో ఉన్నాయి. అలా ఎన్ని పర్యాయాలు దళితబంధు ఇస్తే.. అందరికీ న్యాయం జరగాలే అనే ప్రశ్న వస్తోంది. దళితబంధు స్కీమ్ నగదు తగ్గిస్తే బాగుంటుందని మేధావుల సూచించారు. కనీసం రూ.లక్ష లేదంటే రూ.50 వేల చొప్పున అందరికీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా చేయకపోవడంతో ఆ సామాజిక వర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వస్తోంది.
బీసీల్లో కొందరు.. క్రిస్టియన్లు
ఓసీలు, కొందరు బీసీలు, గంగపుత్రులు, కుమ్మరి, క్రిస్టియన్ల కోసం ఏమీ చేయలేదు. తమ సామాజిక వర్గంలో కూడా సమాజంలో వెనుకబడిన వారు ఉన్నారని చెబుతున్నారు. తమలో కొందరికీ రేషన్ కార్డ్ లేదని.. దీంతో ఉచితంగా వైద్యం అందడం లేదని గుర్తుచేస్తున్నారు. ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు.. తమ కన్నా ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ.. వారికి రేషన్ కార్డ్, ఇతర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని వాపోయారు. తమను మాత్రం ప్రభుత్వం గుర్తించడం లేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం సబ్బండ వర్గాలకు మేలు చేస్తామని అంటోంది. ఉన్న నిధులను ఖర్చు చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్‌తో ఉండి.. ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారని మేధావులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులేం చేశారు..?
అధికార పార్టీ తమ స్వార్థం కోసం.. ఓట్ల కోసం, అడగకున్నా కొన్ని జిల్లాలు కేటాయించినట్టు.. పథకాలు ప్రవేశపెడుతుంది. జనం డబ్బును తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తోంది. ఇవ్వాల్సిన వారికి మాత్రం ప్రయోజనం చేయడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా వారికి నెల ప్రారంభంలోనే వేతనం పడేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారింది. ప్రస్తుతం అయితే.. ఉద్యోగుల వేతనం ఎప్పుడూ వస్తుందనే అంశంపై క్లారిటీ లేదు. టీచర్లకు ఒకలా, ఇంజినీర్లకు ఒకలా వేస్తున్నారు. పంచాయతీ రాజ్ ఉద్యోగులకు ఒక్కో జిల్లాల్లో ఒక్కో తేదీన జీతం వేస్తున్నారు. సో.. ఉద్యోగి నెల ఒకటి, లేదంటే 5వ తేదీన జీతం వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఆ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఉద్యోగుల నుంచి కాస్త వ్యతిరేకత ఉంది. దానిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు.. కొందరినీ కూల్ చేశారు. అదీ లాంగ్ రన్లో సక్సెస్ కాదు అని ఆనలిస్టులు చెబుతున్నారు.
సరికాదు..?
ఓట్ల కోసం.. ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ వేల కోట్ల ప్రజాధనం వృథా చేస్తోంది. నిజమైన వారికి మాత్రం ఆ ఫలాలు అందడం లేదు. అలాంటి వారు ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. మరికొందరు వేతన జీవులు సరైన సమయానికి జీతం రాక తెగ ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వారి పట్ల.. నిర్లక్ష్య వైఖరితో ఉందని.. ఇదీ సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.