హైదరాబాద్ అంబర్ పేట పోలీస్ స్టేషన్ గ్రౌండ్ దగ్గర ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులు నిరసన చేపట్టారు. హైకోర్టు ఆదేశం ప్రకారం మ్యాన్యువల్ గా హైట్ చెక్ చేయకుండా మళ్లీ డిజిటల్ మీటరే ఉపయోగించి తమను డిస్ క్వాలిఫై చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. మరోవైపు లాంగ్ జంప్, షాట్ పుట్ కూడా ఎక్కువగా పెట్టి తమకు డిస్ క్వాలిఫై చేశారని ఇంకొంత మంది వాపోయారు.
హైదరాబాద్(hyderabad) అంబర్ పేట(amberpet) పోలీస్ స్టేషన్ గ్రౌండ్ దగ్గర ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు(SI and constable aspirants )ఆందోళన చేపట్టారు. తెలంగాణ(telangana) హైకోర్టు(high court) ఆదేశం ప్రకారం మ్యాన్యువల్ గా హైట్ చెక్ చేయకుండా మళ్లీ డిజిటల్ మీటరే ఉపయోగించారని వెల్లడించారు. ఈ క్రమంలో డిజిటల్ మీటర్ హైట్ తక్కువగా(height issue) చూపించడం వల్ల తాము డిస్ క్వాలిఫై అయ్యామని బాధిత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇదే అంశంపై పలువురు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. తాము క్వాలిఫై హైట్ ఉన్నా కూడా డిజిటల్ మీటర్(digital meter) ద్వారా తక్కువ చూపిస్తుందని కోర్టుకు తెలుపడంతో మ్యాన్యువల్ గా హైట్ కొలవాలని హైకోర్టు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు(tslprb)ను ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలను అమలు చేయకుండా మళ్లీ పాతపద్దతినే పాటించి తమను డిస్ క్వాలిఫై చేశారని బాధిత పోలీస్ ఉద్యోగార్థులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో సరిగ్గా ఉన్న హైట్ ఈసారి మాత్రం ఎలా తగ్గుతుందని ఇంకొంత మంది అభ్యర్థులు పోలీస్ బోర్డును ప్రశ్నిస్తున్నారు.
అసలు హైట్ ఎంత?
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల(police jobs)కు అప్లై చేసిన అభ్యర్థులు పురుషులు అయితే 167.6 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. మహిళలు 152.2 సెంటీమీటర్లు ఉండాలి. కానీ ఎస్టీ(st), ఏజన్సీ ప్రాంత అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. కానీ గతంలో పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన కానిస్టేబుల్ సహా పలువురు ఎగ్జామ్ రాసిన వారిని సైతం ఈసారి ఎత్తు విషయంలో అనర్హులుగా గుర్తించారని అభ్యర్థులు వాపోయారు. ఈ క్రమంలో పలువురు తెలంగాణ హైకోర్టు(high court)ను ఆశ్రయించగా ఈ మేరకు తీర్పునిచ్చింది.
మేము కూడా కోర్టుకు వెళతాం
మరోవైపు గత పోలీస్ నోటిఫికేషన్లలో ఉన్నవాటి కంటె షాట్ పుట్(shot put), లాంగ్ జంప్(long jump) ఎక్కువ పరిమితి పెట్టారని మరికొంత మంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018 ఈవెంట్లలో తెలంగాణలో షాట్ పుట్(7.26 కేజీలు)-5.6 మీటర్లు వేసిరితే అర్హులు, కానీ ఈసారి ఈవెంట్లలో మాత్రం దానిని ఏకంగా 6 మీటర్లకు పెంచారు. దీంతో అనేక మంది అభ్యర్థులు అనర్హులుగా మిగిలిపోయారు. ఇక లాంగ్ జంప్ కూడా 2018లో 3.80 మీటర్లు దూకిన వారు అర్హులుగా ఉండగా, ఈసారి మాత్రం 4 మీటర్లకు పొడిగించారు. ఈ రెండు ఈవెంట్ల కారణంగా కూడా అనేక మంది పోలీస్ ఉద్యోగార్థులు డిస్ క్వాలిఫై అయ్యారు. దీంతో రన్నింగ్ మాత్రమే క్వాలిఫై అయిన వారికి సివిల్ కానిస్టేబుల్, సివిల్ ఎస్ఐ సహా కొన్ని పోస్టులకు ఫైనల్ పరీక్ష రాసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే తాము కూడా హైకోర్టులో కేసు వేస్తామని అంటున్నారు.