సింగపూర్ దేశానికీ చెందిన DS-SAR అనే ఉపగ్రహంతో పాటుగా అదే దేశానికి చెందిన మరో 6 చిన్న ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వి – సీ56 రాకెట్ ప్రయోగం పూర్తి స్థాయిలో వాణిజ్య ప్రయోగమని ఇస్రో వెల్లడించింది.
ఈ మధ్యనే చంద్రయాన్-3ను అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రయోగంతో కూడా సక్సెస్ అయ్యింది. మొత్తం నాలుగు దశల్లో ఇస్రో ఈ ప్రయోగాన్ని పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికగా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ సీ56 రాకెట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ- సీ55 మాదిరిగానే పీఎస్ఎల్వీ- సీ56 కూడా మిషన్ కోర్-ఎలోన్ మోడ్‌లో ఇస్రో కాన్ఫిగర్ చేసి విజయవంతమైంది.
DS-SAR ఉపగ్రహాన్ని ప్రాథమిక పేలోడ్ గా పీఎస్ఎల్వీ- సీ56 తీసుకెళ్లడం విశేషం. సింగపూర్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ, ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో వాటిని ఇస్రో అభివృద్ధి చేసింది. ఈ 360 కిలోల DS-SAR ఉపగ్రహాన్ని 5 డిగ్రీల వంపులో 535 కిలోమీటర్ల ఎత్తులో నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్ లోకి ఇస్రో ప్రవేశపెట్టి అద్భుత ఘనతను సాధించింది. ఈ ఉపగ్రహాల బరువు 228.64 టన్నులు కాగా, 7 ఉపగ్రహాల బరువు మొత్తం కలిపి 442 కిలోలుగా ఉంది.
అధునాతన సాంకేతికత కలిగిన DS-SAR అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సహకరిస్తుందని ఇస్రో వెల్లడించింది. పగలైనా, రాత్రయినా కవరేజీని అందించే సామర్థ్యంతో ఇది పనిచేస్తుందని, DS-SAR శాటిలైట్ తో పాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపినట్లుగా ఇస్రో తెలిపింది. టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-AM, ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ ARCADE, 3U నానోశాటిలైట్ స్కూబ్-2, IoT కనెక్టివిటీ నానోశాటిలైట్ నూలయన్, గెలాసియా-2, ORB-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపి విజయం సాధించినట్లు ఇస్రో వెల్లడించింది.