టాక్ షోలలోనే నంబర్ వన్ గా నిలుస్తున్న అన్ స్టాపబుల్-2 షోకు సంబంధించిన మరో ప్రొమో విడుదలైంది. షో హోస్ట్ నందమూరి బాలకృష్ణ తన ప్రశ్నలతో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఇరకాటంలోకి నెట్టేశాడు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు, సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లపై బాలయ్య ప్రశ్నలు అడగడంతో పవన్ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అయినా కూడా పవన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈ మధ్యలో రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ రాకతో టాక్ షోలో నవ్వులు విరబూశాయి.
తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యాడు. షోకు పవన్ వస్తున్నాడనే వార్త మొదలుకుని షూటింగ్ పూర్తయ్యే వరకు అభిమానులు నానా హంగామా చేశారు. షూటింగ్ పూర్తయి ఎడిటింగ్ పనుల్లో ఎడిటర్లు తలామునకలయ్యారు. పవన్ తో బాలకృష్ణ సాగించిన సంభాషణ ప్రేక్షకులకు మరింత కిక్కివ్వనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించి మరో ప్రొమో విడుదలైంది. ఈ ప్రొమోలో బాలకృష్ణ సరదా సరదా ప్రశ్నలు అడుగుతూనే.. పవన్ వ్యక్తిగత జీవితంలోని పలు ముఖ్యమైన విషయాలపై కూడా మాట్లాడారు. సినీ నట ప్రస్థానం మొదలుకుని రాజకీయ జీవితం దాకా చాలా ప్రశ్నలు అడిగాడు. అంతకుముందు ప్రొమో ప్రారంభంలోనే ‘ఈశ్వరా.. పవనేశ్వరా’ అనే బండ్ల గణేశ్ మాటలను బాలకృష్ణ పలకడంతో ప్రేక్షకులకు నవ్వులు ఆగలేదు. అనంతరం బాలయ్య డైలాగ్ పవన్ పలికాడు. ఆ తదనంతరం రామ్ చరణ్ తో బాలయ్య ఫోన్లో మాట్లాడడం, సాయిధరమ్ తేజ్ వచ్చి సంభాషించడం సరదాగా జరిగింది.
ఈ ఎపిసోడ్ ను ప్రభాస్ మాదిరిగా రెండు ఎపిసోడ్ లలో వేసే అవకాశం ఉంది. ప్రేక్షకుల్లో ఈ ఇంటర్వ్యూ పట్ల విపరీతమైన క్రేజ్ ఉండడంతోనే దాన్ని ఆసరాగా చేసుకుని ఆహా రెండు విభాగాల్లో ప్రసారం చేసే అవకాశం ఉంది. మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 3వ తేదీన విడుదలవుతోందని ఆహా ప్రకటించింది. మేన్షన్ సమర్పిస్తున్న అన్ స్టాపబుల్ షో టాక్ షోలలోనే నంబర్ వన్ గా నిలుస్తున్నది. ఈ ఎపిసోడ్ కోసం పవన్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్, బాలయ్య కలిస్తే ఇద్దరి నటుల అభిమానులకు పండుగలాగా ఉంది. మరి పూర్తి ఇంటర్వ్యూ వస్తేనే కానీ బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడిగాడో తెలుస్తుంది.