»One Woman Tweet On Food Delivery Container Charges Zomato Clarity
Food delivery: ఛార్జీలపై మహిళ ట్వీట్..జొమాటో క్లారిటీ
ఓ మహిళ తనకు బాగా ఆకలిగా ఉందని జొమాటోలో మూడు రోటిలు ఆర్డర్ చేసుకుంది. అయితే వాటికి ధర రూ.180 కాగా, కంటైనర్ ఛార్జీలను రూ.60గా పేర్కొంటూ బిల్లు వేశారు. అది చూసిన ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ Zomatoను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. దీనిపై జొమాటో స్పందించి క్లారిటీ ఇచ్చింది.
ఒక మహిళ Zomato నుంచి ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆ క్రమంలో తనకు వచ్చిన డెలివరీ బిల్లు చూసి షాక్ అయ్యింది. మూడు ప్లేట్ల దూదీ తెప్లా(రోటీ) రూ.180 బిల్లు కాగా..కేవలం ఫుడ్ ప్యాకింగ్ కంటైనర్ ఛార్జీల కోసం అదనంగా రూ.60 చెల్లించాలని బిల్లులో ఉంది. అయితే ఆమె ఆర్డర్ చేసిన డిష్‌లోని ఒక్కో ప్లేట్ ఖర్చు కూడా రూ.60 కావడం విశేషం. దీంతో ఆవేదన చెందిన ఆ మహిళ ఫుడ్ కంటైనర్ వసూలు ఛార్జీలు ఇంత చేస్తున్నారెంటని సోషల్ మీడియా వేదికగా జొమాటోను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది. దీంతోపాటు ఆమె తన బిల్లు స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. మితిమీరిన, అన్యాయమైన కంటైనర్ ఛార్జీపై తాను అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఫుడ్ డెలివరీ కంపెనీ దీనిపై వివరణ ఇవ్వాలని గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన ఖుష్బూ ఠక్కర్ డిమాండ్ చేసింది.
అయితే దీనిపై జొమాటో స్పందిస్తూ కంటైనర్ ఛార్జీని రెస్టారెంట్లు విధిస్తాయని తెలిపింది. పన్నులు సార్వత్రికమైనవని పేర్కొంది. ఫుడ్ తీరుని బట్టి 5% నుంచి 18% వరకు ట్యాక్సులు ఉంటాయని వెల్లడించింది. ప్యాకేజింగ్ ఛార్జీలను వారి రెస్టారెంట్ భాగస్వాములు సెట్ చేస్తారని, వారు ఈ పద్ధతి ద్వారా లాభం పొందుతున్నారని జొమాటో రిప్లై ఇచ్చింది. అయితే దీనిపై రియాక్ట్ అయిన ఖుష్బూ కస్టమర్లకు అదనపు ఖర్చు లేకుండా కంటైనర్లను అందించడం రెస్టారెంట్ బాధ్యత కాదా అంటూ ప్రశ్నించారు. ఇది చూసిన పలువురు ఖుష్బూతో ఏకీభవించగా.. రెస్టారెంట్ అటువంటి ఛార్జీలు విధించదని మరికొంత మంది అంటున్నారు. ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.