»Ohio Train Crash Leaves Small Town In Fear Of Toxic Fallout
Ohio train crash: వాతావరణం విషపూరితం.. బాటిల్ నీళ్లనే తాగండి
అమెరికాలోని (America) ఓహియో(Ohio) రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం అనంతరం వాతావరణంలో ప్రమాదకర రసాయనాలు కలిశాయి. దీంతో స్థానికులు వాటర్ బాటిల్ నీళ్లనే తాగాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
అమెరికాలోని (America) ఓహియో(Ohio) రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. 50 బోగీలు పట్టాలు (train derailment) తప్పాయి. రైలులో అత్యంత ప్రమాదకర వినైల్ క్లోరైడ్ గ్యాస్‌ను (vinyl chloride) తరలిస్తున్నారు. ప్రమాదం తర్వాత బోగీలు అగ్నికీలల్లో చిక్కుకోవడంతో ఈ గ్యాస్‌లో క్యాన్సర్ కారకాలు ఉంటాయని అమెరికా నేషనల్ క్యాన్సర్ సెంటర్ హెచ్చరించింది. ఒహియో-పెన్సిల్వేనియా రాష్ట్రాల మధ్య ఈస్ట్ పాలస్టైన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇల్లినాయిస్లోని మాడిసన్ నుండి ఈ కార్గో రైలు కాన్వేకి వెళ్తోంది. తొలుత 38 బోగీలు మాత్రమే పట్టాలు తప్పాయి. అగ్ని ప్రమాదం తర్వాత మరో 12 తప్పాయి. దీంతో ఇక్కడి వాతావరణం విషపూరితమైన నేపథ్యంలో స్థానికులు అందరు కూడా బాటిల్ నీటిని మాత్రమే తాగాలని రాష్ట్ర గవర్నర్ విజ్ఞప్తి చేసారు. అత్యంత ప్రమాదకర గ్యాస్ వాతావరణంలో కలిసినందున జాగ్రత్తగా ఉండాలన్నారు. మరోవైపు, ఇక్కడ గాల్లో చోటు చేసుకున్న మార్పులను అమెరికా గమనిస్తోంది. ఆ ప్రదేశంలోని భూగర్భ జలాలను పరీక్షిస్తోంది. ప్రస్తుతం స్థానిక బోర్లలోని నీటిని మొదటి విడతలో పరీక్షించగా ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడైంది. కానీ మరిన్ని పరీక్షలు జరిపి, ఫలితాలు రావాల్సి ఉంది. సమీపంలోని నది, కాల్వల్లోని నీటిని కూడా పరీక్షిస్తున్నారు. కాబట్టి అప్పటి వరకు ఈ నీటిని తాగవద్దని సూచించింది ప్రభుత్వం. మరోవైపు, ఓహియో రెసిడెంట్స్.. అధికారులను పరిస్థితిపై ప్రశ్నిస్తున్నారు.
పట్టాలు తప్పిన బోగీలలోని పదకొండింటిలో వినైల్ క్లోరైడ్, బ్యూటైల్ ఆక్రైలేట్తో పాటు ఇతర ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి. అధికారులు ప్రమాదాన్ని అంచనా వేయడంతో పాటు వెనువెంటనే వేలాదిమంది స్థానికులను ఖాళీ చేయించారు. పేలుడును నివారించే ప్రయత్నాలు చేశారు. రైలు ప్రమాదం జరిగిన ఐదారు రోజుల తర్వాత స్థానికులను తిరిగి వారి ఇళ్లకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. అయితే గాలి, నీరు.. ఇలా వాతావరణంలో విషపూరితాలు ఉండే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ ప్రమాదం అనంతరం సమీపంలోని కాలువలలో 7.5 కిలో మీటర్ల దూరంలో వేలాది చేపలు చనిపోయినట్లు ఓహియో డిపార్టుమెంట్ ఆఫ్ నేచరల్ రిసోర్సెస్ తెలిపింది.
ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి దాదాపు రెండు వారాలు గడుస్తోంది. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి పరిస్థితి దారుణంగా ఉందని అధికారులను నిలదీస్తున్నారు. ఫిబ్రవరి 3న తాను తన ఇంటిలో సోఫాలో కూర్చొని ఉండగా, భారీ శబ్ధం వినిపించిందని, ఏం జరిగిందో తెలుసుకోవడానికి తాను తన భార్యతో కలిసి కారులో ముందుకు సాగామని, రైలు ప్రమాదం చూసి భయాందోళనకు గురయ్యామని 73 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ ఒకరు చెప్పారు. అక్కడ వరుసగా పేలుళ్లు చోటు చేసుకున్నాయని, భయంకరమైన విషపూరిత కెమికల్ వాసన కనిపించిందని మరో వ్యక్తి మిస్టర్ ఫిగ్లీ చెప్పారు. విషపూరిత వినైల్ క్లోరైడ్ పేలడానికి ముందే అధికారులు కాల్చడంతో వాతావరణం కలుషితమైందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్ వాటర్ బాటిల్ నీరు తాగాలని సూచించారు. అయితే దీని ప్రభావం దీర్ఘకాలం ఎలా ఉంటుందోనని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాల ప్రభావంపై ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి.