ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని ఎంపి ఎమ్మెల్యే కోర్టు శనివారం బీజెపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో కీలక తీర్పు ఇచ్చింది. కిడ్నాప్, హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాఫియా, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీని దోషిగా నిర్ధారించింది. ఈ క్రమంలో అతనికి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.5 లక్షల జరిమానా కూడా వేసింది. 2005లో గ్యాజీపూర్లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ.. అతని సోదరుడు అఫ్జల్ అన్సారీతో కలిసి ఈ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2005లో ఘాజీపూర్‌లో హత్యకు గురైన దివంగత బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ భార్య అల్కా రాయ్ తాను న్యాయవ్యవస్థను నమ్ముతానని, గూండాలు, మాఫియాల పాలన రాష్ట్రంలో ముగిసిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
గ్యాజీపూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఈరోజు గ్యాంగ్‌స్టర్ రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ, అతని సోదరుడు అఫ్జల్ అన్సారీ నిందితులుగా ఉన్న కేసులో తీర్పును ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే కేసులో ఘాజీపూర్ సీటు నుంచి అతని సోదరుడు, బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి శిక్ష ఖరారు కావాల్సి ఉంది.
జనవరి 2001లో జరిగిన ‘ఉస్రీ చట్టీ’ గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి కూడా ముఖ్తార్ అన్సారీపై పోలీసులు కేసు నమోదు చేశారు.