»Mlc Kavitha Said Sukesh Chandrasekhar I Dont Know
MLC Kavitha: సుకేష్ నాకు తెలియదు..వాట్సాప్ చాట్ తో సంబంధం లేదు
పలు కేసుల్లో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్(Sukesh chandrasekhar).. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)తో వాట్సాప్ చాట్స్ ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అయితే వాటితో తనకు సంబంధం లేదని కవిత అన్నారు. అసలు సుకేష్ తో తనకు పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఆ వాట్సాప్ చాట్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీలు కోరుతున్నాయి.
మనీలాండరింగ్, చీటింగ్ కేసులో ఢిల్లీ జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్(Sukesh chandrasekhar).. బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కె.కవిత(MLC Kavitha)పై ఇటీవల ఓ బాంబు పేల్చారు. ఏప్రిల్ 12న సుకేష్ తన లాయర్ ద్వారా వాట్సాప్ చాటింగ్ వివరాలను తెలుపుతూ 20 పేజీల లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకే హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రూ.15 కోట్లు ఇచ్చామని అందులో స్పష్టం చేశారు.
ఆ క్రమంలో కవిత అక్క టీఆర్ఎస్’ పేరుతో ఎమ్మెల్సీ కవిత పేరు తన ఫోన్ నంబర్లో సేవ్ అయి ఉండటం గమనించవచ్చు. కవితతో తాను చాట్ చేశానని చెబుతున్న ఆరు పేజీల చాట్ వివరాలను సుకేష్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాట్లాడిన వివరాలతో పాటు ఎవరి ఆదేశాల మేరకు డబ్బులు అందజేశారో వెల్లడించారు. ఆ లేఖను భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర హోం మంత్రి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఈడీకి కూడా పంపారు.
వాట్సాప్ చాట్‌లోని కోడ్ లాంగ్వేజ్ వివరాలను కూడా సుకేష్ చంద్రశేఖర్(Sukesh chandrasekhar) లేఖలో స్పష్టం చేశారు. ఎకె అంటే అరవింద్ కేజ్రీవాల్, ఎస్‌జె అంటే సత్యేంద్ర జైన్, మనీష్ అంటే మనీష్ సిసోడియా, అరుణ్ అంటే అరుణ్ పిళ్లై, జెహెచ్ అంటే జూబ్లీహిల్స్, ఆఫీస్ అంటే టిఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ (BRS), ప్యాకేజీ అంటే రూ.15 కోట్ల రూపాయలని స్పష్టం చేశారు. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుకేష్ ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు.
ఈ ఘటనపై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. అసలు సుకేష్ చంద్రశేఖర్ తో తనకు పరిచయం లేదని పేర్కొన్నారు. ఆమెపై ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కవిత చెబుతున్నారు. పలు మీడియా సంస్థలు ఈ వాట్సాప్ చాట్ గురించి దుష్ప్రచారం చేస్తున్నాయని కవిత అన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్(BRS) పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇవన్నీ చేస్తున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.