మానవ మనుగడ కోసం, ఇతర గ్రహాల్లో(Planets) జీవ ఉనికిని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ వారి పరిశోధనల్లో సరైన విషయాలు తెలియలేదు. చంద్రునిపై ఈ మధ్యనే ఇస్రో చంద్రయాన్3 (chandrayan 3)ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెడ్ ప్లానెట్‌గా పిలిచే మార్స్‌లో జీవ అవశేషాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. ఆ దిశగా ఎప్పటి నుంచో పరిశోధనలు సాగుతున్నాయి. అంగారక గ్రహంలోని వాతావరణం భూమి వాతావరణాన్ని పోలి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.
తాజాగా అంగారక గ్రహం (Mars Planet)పై అవక్షేపణ పొరల్లో హెక్సాగోనల్ నమూనాల్లో ఏర్పడేటటువంటి లవణాల నిక్షేపాలను పరిశోధకులు(scientists) కనుగొన్నారు. అది జీవి ఆవిర్భావానికి అనుకూల వాతావరణాన్ని సూచిస్తుందని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. 3.8 నుంచి 3.6 బిలియన్ సంవత్సరాల క్రితం నాటి లవణాల నిక్షేపాలను మార్స్ గ్రహంపై పరిశోధకులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో లవణాలను గుర్తించిన ప్రదేశాల్లో ప్రయోగాలను ముమ్మరం చేసే అవకాశం ఉంది. జీవ ఉనికికి దారితీసిన సహజ ప్రక్రియల జాడల కోసం ఆ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనేక విషయాను పరిగణలోకి తీసుకుని రాబోయే రోజుల్లో జీవ ఉనికికి కావాల్సిన అనువైన ప్రదేశాలను అంగారక గ్రహంపై గుర్తించే అవకాశం ఉందని, త్వరలోనే మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.