KMC student Preeti: ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమం, గవర్నర్ వద్ద విలపించిన పేరెంట్స్
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో (MGM Hospital) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని (Medical Student) ఇరవయ్యారేళ్ల ప్రీతి (KMC student Preeti) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ (NIMS) వైద్యులు తెలిపారు.
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో (MGM Hospital) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని (Medical Student) ఇరవయ్యారేళ్ల ప్రీతి (KMC student Preeti) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ (NIMS) వైద్యులు తెలిపారు. వెంటిలెటర్ పైన ఉన్నదని, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్ట్ తో కూడిన అయిదుగురు డాక్టర్ల బృందం నిరంతరం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. డాక్టర్ ప్రీతిని నిమ్స్ కు తీసుకు వచ్చే సమయానికే వివిధ అవయవాలు పని చేయడం లేదని, ఆమెను వెంటిలేటర్ సహాయంతో తరలించినట్లు నిమ్స్ తెలిపింది.
సీనియర్ సైఫ్ (Saif) వేధింపులతోనే తన కూతురుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య వస్తే కుటుంబ సభ్యులకు చెప్పే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటే ఎలా నమ్మగలమన్నారు. తన కూతురును వేధించిన సైఫ్ పైన హత్యాయత్నం కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా తన కూతురు ప్రాణాలకు తెగించి విధులను నిర్వర్తించిందన్నారు. వేధింపులపై ఏసీపీ ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి ఓ ఆపరేషన్ లో కూడా తన కూతురు పాల్గొందని తెలిపారు. వరంగల్ హాస్పిటల్ లోనే ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రీతి ఆత్మహత్యాయత్నానికి వేధింపులే కారణమని నిమ్స్ ఆవరణలో బీజేపీ, టీడీపీ, బీఎస్పీ, బజరంగ్ దళ్ తదితరులు ఆందోళన చేశారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి రవీంద్ర నాయక్. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి.
సైఫ్ వాట్సాప్ ద్వారా ప్రీతిని వేధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పోలీసులు బుధవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రీతి గదిని పరిశీలించి, పూర్తి సమాచారాన్ని సేకరించారు. సైఫ్ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ర్యాగింగ్ కేసును నమోదు చేశారు. ఆత్మహత్యాయత్నంపై విచారణ జరుపుతున్నామని, ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ తో పాటు, ప్రీతిని పిలిచి రెండు రోజుల క్రితం కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. పీజీ స్థాయిలో ర్యాగింగ్ జరగదని, ఊహాగానాలు సరికాదన్నారు.
తమిళసై, హరీష్ పరామర్శ
నిమ్స్ లో (NIMS) ప్రీతిని గవర్నర్ తమిళిసై (governor tamilisai) గురువారం పరామర్శించారు. అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇది చాలా బాధాకర పరిస్థితి అని, ఒక వైద్యురాలిగా తాను పరిస్థితిని అర్థం చేసుకోగలనని చెప్పారు. ప్రీతిని బతికించాలని దేవుడిని ప్రార్థించడంతో పాటు డాక్టర్లను కోరానని చెప్పారు. గవర్నర్ వచ్చిన సమయంలో ప్రీతి తల్లిదండ్రులు బోరున విలపించారు. వారిని ఆమె ఓదార్చారు.
ప్రీతి ఆత్మహత్యాయత్నం ఎంతో బాధాకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు (Harish Rao) చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.