»Karnataka Elections Congress Party Uturn On Bajrang Dal Ban Veerappa Moily Comments
Karnataka Elections బజరంగ్ దళ్ నిషేధంపై కాంగ్రెస్ యూటర్న్..
విద్వేష రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బజరంగ్ దళ్ ను నిషేధించే ప్రతిపాదన మా వద్ద లేదు. మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి మా పార్టీ కట్టుబడి ఉంది.
మత కల్లోలాలు, విధ్వంసాలు, అల్లర్లకు ప్రేరేపిస్తున్న బజరంగ్ దళ్ (Bajrang Dal)ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress Party) మేనిఫెస్టోలో ప్రకటించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో ఒక్కసారిగా కర్ణాటక ఎన్నికల (Karnataka Election) ప్రచార శైలి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడంతా మతం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడాల్సిన పార్టీలు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయి. కాగా మేనిఫెస్టోలో ప్రకటించిన దానిపై కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. బజరంగ్ దళ్ ను నిషేధించే ఉద్దేశం లేదని పార్టీ అగ్ర నాయకులు ప్రకటించడం గమనార్హం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తాము అధికారంలోకి వస్తే అల్లర్లు సృష్టిస్తున్న బజరంగ్ దళ్, పీఎఫ్ఐ (PFI) వంటి సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో (Manifesto) ప్రకటించింది. అయితే దీనిని బీజేపీ అస్త్రంగా చేసుకుని రాజకీయం నడిపిస్తోంది. ప్రధాని మోదీ (Modi), ఇతర బీజేపీ నాయకులు ఇక రాముడు, ఆంజనేయుడు అంటూ రాజకీయాలు ప్రారంభించారు. ఈ నిషేధం ప్రకటనపై తీవ్ర విమర్శలు రావడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం వీరప్ప మొయిలీ (Veerappa Moily) స్పందిస్తూ.. ‘బజరంగ్ దళ్ పై నిషేధం విధించే ఆలోచన లేదు’ అని ప్రకటన చేశారు. గురువారం ఉడిపిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ (DK Shivakumar) కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. ‘విద్వేష రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బజరంగ్ దళ్ ను నిషేధించే ప్రతిపాదన మా వద్ద లేదు. మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి మా పార్టీ కట్టుబడి ఉంది’ అని డీకే శివ కుమార్ తెలిపారు.
అనూహ్యంగా ఈ ప్రకటన (Statement) చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం దాగి ఉందని తెలుస్తున్నది. బజరంగ్ దళ్ పై నిషేధం (Ban) ప్రకటనతో హిందూవుల వ్యతిరేక పార్టీగా తాము ముద్రపడతామని కాంగ్రెస్ నాయకులు భావించారు. బీజేపీ నిషేధం ప్రకటననే అస్త్రంగా చేసుకుని ప్రచారం సాగిస్తుండడంతో హిందూవుల ఓట్లన్నీ వారికే పడే ప్రమాదం ఉందని హస్తం పార్టీ గ్రహించింది. అధికారంలోకి వచ్చాక చూసుకుందాం.. ముందైతే ఆ సంఘాన్ని నిషేధించబోమనే ప్రకటన ఇస్తే కొంత నష్టాన్ని నివారించవచ్చని పార్టీ అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే నిషేధం ప్రకటనపై కాంగ్రెస్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారంలోకి వస్తామని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో హిందూవులు దూరమైతే కొంత ఇబ్బందికరమని భావించి కాంగ్రెస్ నాయకులు పై ప్రకటన చేశారని సమాచారం. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.