భారత బాక్సింగ్(Boxing) దిగ్గజం కౌర్ సింగ్(Kaur singh) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన హర్యానాలోని కురుక్షేత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కౌర్ సింగ్ మృతి పట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంతాపం తెలియజేశారు. కౌర్ సింగ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడి కౌర్ దేశం పేరు నిలబెట్టారని సీఎం కొనియాడారు. కౌర్ సింగ్ కు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు.
కౌర్ సింగ్(Kaur singh) పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలో ఖనాల్ ఖుర్ద్ అనే గ్రామంలో జన్మించారు. బాక్సింగ్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. దిగ్గజ ఆటగాడు అయిన మహమ్మద్ ఆలీతో తలపడిన ఏకైక ఇండియన్ బాక్సర్ గా కౌర్ సింగ్ చరిత్రకెక్కారు. ఢిల్లీ వేదికగా 1982 జరిగిన ఆసియా క్రీడల్లో పసిడి పతకాన్ని సాధించారు.
అంతర్జాతీయ పోటీల్లో ఆరు పసిడి పతకాలు సాధించిన కౌర్ సింగ్(Kaur singh) ఒలింపిక్స్ లోనూ భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. బాక్సింగ్ లో కౌర్ ఘనతకు గుర్తింపుగా 1982లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు, 1983లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. 1988లో విశిష్ట సేవా మెడల్ పురస్కారాన్ని కూడా అందించింది. 1971లో పాక్ తో జరుగుతున్న యుద్ధంలో కౌర్ సింగ్ పాల్గొని పోరాడారు. ఈ నెల 9, 10 తరగతుల పాఠ్య పుస్తకాలలో కౌర్ సింగ్ జీవిత కథను చేర్చనున్నట్లు పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ వెల్లడించారు.