దక్షిణాదికి త్వరలోనే మరో మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుపుతున్న భారతీయ రైల్వే.. మరో 3 సెమీ హైస్పీడ్ రైళ్లను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు రైల్వేఅధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి పుణె నగరాల మధ్య సర్వీస్ అందించబోతున్నట్లు సమాచారం. మరో మూడు వందే భారత్ రైళ్లు రావడం అంటే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది మరో భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మిగతా ట్రైన్ల కంటే వేగంగా ప్రయాణిస్తూ త్వరగా గమ్యస్థానానికి చేర్చడంతో పాటు ఏసీ, వైఫై సౌకర్యంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఈ ట్రైన్లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రోజూ ఈ ట్రైన్ ప్రయాణికులతో సందడిగా కనిపిస్తోంది.