For being active on social media. Brother beat sister to death
Social Media: సోషల్ మీడియాలో సోదరి యాక్టివ్ గా ఉంటుందని, రోజు రీల్స్(Videos) చేస్తుందని కోపగించుకుని సొంత సోదరిని..సోదరుడు రోకలిబండతొ కొట్టి చంపేశాడు. తరువాత రాయి తగిలి మరణించినట్లు నమ్మించి హడావిడిగా అంత్యక్రియలకు ఏర్పాటు చేయడంతో అనుమానించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ షాకింగ్ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర సింధు (21) అలియాస్ సంఘవి మహబూబాబాద్‌లో ఏఎన్ఎం అప్రెంటిస్(ANM Apprentice in Mahbubabad) చేస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ వీడియోలు పెడుతుండడం సోదరుడు హరిలాల్‌కు నచ్చేది కాదు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య తరచు గొడవలు(quarrels) జరుగుతూ ఉండేవి. సోమవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన హరిలాల్ ఇంట్లోని రోకలిబండతో సోదరి తలపై గట్టిగా కొట్టడంతో తలకు తీవ్రంగా గాయం అయి కిందపడిపోయింది. ముందు సృహతప్పి పడింది అనుకున్నాడు. తరువాత తల నుంచి రక్తం వస్తుండడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
ఖమ్మం(Khammam) ఆసుపత్రికి తరలించనప్పటికీ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సింధు మృతి చెందింది. ఇంటికి తీసుకొచ్చి రాయి తగిలి చనిపోయిందని చెబుతూ మంగళవారం ఉదయం హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హత్య కోణం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం బయటకు రావడంతో హరిలాల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.