ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాల్లోని నిల్వల పైన వడ్డీ రేటును (Interest Rate) ఖరారు చేసింది ఈపీఎఫ్ఓ (EPFO). 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 8.15 శాతం వడ్డీ రేటును (8.15 interest rate) ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ వర్గాలు మంగళవారం తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరం 8.10 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ. ఈపీఎఫ్ఓ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించినట్లు తెలిపాయి. సీబీటీ (CBT) నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదించిన అనంతరం వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ (EPFO) ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తుంది. ప్రభుత్వ ఆమోదం అనంతరం ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును అధికారికంగా ప్రకటిస్తుంది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ పైన వడ్డీ రేటు అధికంగా 8.50 శాతంగా ఉంది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో దీనిని 8.1 శాతానికి తగ్గించారు. ఇప్పుడు కాస్త పెంచి, 8.15 శాతంగా నిర్ణయించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్ పైన వడ్డీ రేటు 2021-22లోనే తక్కువగా ఉంది. 2011-12లో వడ్డీ రేటు 8.25 శాతంగా ఉండగా, అత్యధికంగా 2015-16లో 8.8 శాతం ఉంది. 2013-14, 2014-15లలో 8.75 శాతం, 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం, 2018-19లో 8.65 శాతంగా ఉంది.