ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 వస్తే చాలు ప్రేమికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరికొంత గులాబీలు ఇచ్చుకుంటూ ప్రపోజ్ చేసుకుంటారు. ఇంకొంత మంది అయితే సినిమాలు, షికార్లు అంటూ రకరకాలుగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ రోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. కానీ ఈసారి మాత్రం కొంచెం వినూత్నంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ప్రేమికులు గోవులను ఆలింగనం(Cow Hug Day) చేసుకోవాలని సూచిస్తున్నారు. అసలు లవర్స్ డే(lovers day) జరుపుకోవడం భారతదేశ సంప్రదాయం కాదని, ఫారెన్ కల్చర్ అని చెబుతున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా జంతు సంక్షేమ బోర్డు సూచించింది.
ఫారెన్ కల్చర్
ఇప్పటికే మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఫారెన్ దేశాల సంస్కృతి(foreign culture) పెరిగిందని వెల్లడించారు. ఈ క్రమంలో భారతీయ సంప్రదాయాలు దాదాపు అంతరించిపోతున్నాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే యువతతోపాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కోరుతుంది.
మానసిక స్థైర్యం..
అయితే ఆవును కౌగిలించుకోవడం వల్ల సామూహిక ఆనందం పెరగడంతోపాటు వ్యక్తిగతంగా మానసిక స్థైర్యం కూడా చేకూరుతుందన్నారు. మారుతున్న అలవాట్లకు అనుగుణంగా మన చుట్టు ఉన్న పరిస్థితులు, జీవ జాతులు కూడా రోజువారీ జీవితంలో భాగమేననే విషయం గుర్తుంచుకోవాలని చెబుతున్నారు ఆవు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని వాటి గురించి కూడా తెలుసుకోవాలని కోరారు.
ఆవులో 3 వర్గాల దేవతలు
హిందూ మతంలో ఆవును తల్లిలా పరిగణిస్తారు. ఆవులో మూడు లోకాలలోని మూడు వర్గాల దేవతలు నివస్తారని ప్రాచుర్యంలో ఉంది. అంతేకాదు ఆవులో 33 దేవతలు కొలువై ఉంటాయని హిందూ పురణాల్లో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఆవును పూజిస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. అంతేకాదు ఆవు(cow uses) పాలు, పెరుగు, నెయ్యి, పేడ, గోమూత్రం మొదలైన వాటిని మానవ జీవితంలో విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాదు గోమాతను పూజించడం ఎప్పటి నుంచో ఉందని పురణాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణుడి ద్వాపర యుగంలో కూడా ఆవులను ఇష్టపడేవారు. అప్పటి నుంచే గోవుకు సేవ చేసినా, దానం చేసిన మంచి జరుగుతుందని ఎక్కువ మంది ప్రజలు నమ్ముతారని ప్రాచుర్యంలో ఉంది.
ఆవు ప్రాముఖ్యత
జంతువులలో చాలా ప్రాముఖ్యం ఉండి అత్యంత పవిత్రమైనదిగా భావించే జంతువు ఆవేనని చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాల శాంతికి ఆవును పూజిస్తున్నారని అంటున్నారు. జాతక దోషాలు, సంతాన ప్రాప్తి, దోశం తొలగింపు, ఐశ్వర్యం పొందడానికి ఇలా అనేక శుభకార్యక్రమాలకు ఆవుకు సేవ చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కామధేనుడిలా అన్ని రకాల కోరికలను గోమాత తీరుస్తుందని చెబుతుంటారు. ఆవు పేడను కూడా అనేక పూజ కార్యక్రమాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో సైతం ఔషదాల తయారీకి, పంచామృతం తాయారీకి ఆవు మూత్రం వాడతారు.