ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 23) పదహారో సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. నాలుగు మ్యాచ్ లు ఆడిన ఈ జట్టు ఒక్కటి కూడా గెలవలేదు. నిన్న ముంబై ఇండియన్స్ తో (Mumbai Indians) జరిగిన మ్యాచ్ లో బోణీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఈ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. ఢిల్లీ పైన ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడోతో గెలుపొందింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో కామెరూన్ గ్రీన్ తో (Cameron Green) కలిసి టిమ్ డేవిడ్ (Tim David) రనౌట్ ప్రమాదం నుండి తప్పించుకొని, ముంబైని గట్టెక్కించాడు. ఒకవేళ టిమ్ రనౌట్ అయితే సూపర్ ఓవర్ ఉండేది. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) బంతిని వికెట్ల వైపు విసిరినప్పటికీ టిమ్ అప్పటికే క్రీజులోకి వచ్చేశాడు. అయితే డేవిడ్ వార్నర్ (David Warner) ఇదే బంతిని కామెరూన్ (Cameron Green) వైపు విసిరి ఉంటే రనౌట్ అయ్యే అవకాశాలు ఉండేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వార్నర్ ఆ బంతిని అటు వైపు విసరడానికి గల కారణాలను చెప్పారు.
గత మూడు మ్యాచ్ లలోను అద్భుతంగా ఆడామని, అయితే ఈ రోజు తమ కుర్రాళ్లు మరింత బాగా ఆడారని చెప్పాడు వార్నర్. ఓడిపోవడం బాధగానే ఉందని, కానీ జట్టు సభ్యులు మాత్రం మంచి ప్రదర్శన కనబరిచారన్నారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బాగా ఆడాడని, నోకియా అంతర్జాతీయ బౌలర్ అని, ఇతను మేం ఆశించిన దాని కంటే మంచి ప్రదర్శన కనబరిచారన్నారు. ముస్తాఫిజుర్ మంచి ప్రదర్శన కనబరిచారన్నారు. చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ రాంగ్ సైడ్ లో పరుగెత్తాడని, దీంతో స్టంప్స్ పడగొట్టేందుకు బంతిని కాస్త పైకి వేసేందుకు ప్రయత్నించానని చెప్పారు. తమ వికెట్లు త్వరగా కోల్పోవడం నష్టం చేకూరుస్తుందన్నారు. అక్షర్ పటేల్ మాత్రం అదరగొట్టినట్లు చెప్పారు. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ 54, డేవిడ్ వార్నర్ 51తో అదరగొట్టారు. వార్నర్ 47 బంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టారు.
కాగా, పాయింట్ల పట్టికలో లక్నో మొదటి స్థానంలో ఉంది. ఈ టీమ్ నాలుగు మ్యాచ్ లు ఆడి, మూడింట విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా రాజస్థాన్, కోల్ కతా, గుజరాత్, చెన్నై, పంజాబ్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఉన్నాయి. మిగతా అన్ని టీమ్ లు మూడు మ్యాచ్ ల చొప్పున ఆడి, ఒకటి లేదా రెండు గెలిచాయి. ఢిల్లీ మాత్రం నాలుగు మ్యాచ్ లు ఆడి ఒక్కటీ గెలవలేదు.