»Cpi National Secretary K Narayana Fire On Bogus Voters In Tirupati
Bogus Voters ఒక మహిళకు 18 మంది భర్తలా? విస్తుపోయిన CPI నారాయణ
ఒక మహిళకు 18 మంది భర్తలు ఉన్నట్లు జాబితాలో ఓట్లు నమోదు చేయడం సిగ్గుచేటు. దొంగ్ల ఓట్ల నమోదుకు అనుమతించిన అధికారులను బహిరంగంగా ఉరి తీసినా పాపం లేదు. పట్టభద్రుల ఎన్నికల్లో విద్యార్హత కలిగిన వారికి ఓటు హక్కు కల్పించడం లేదు. పైగా అర్హత లేని వారి పేర్లతో జాబితా రూపొందించడం చాలా దారుణం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికారంలోని జగన్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ కార్యక్రమాలకు వినియోగించుకుంటోంది. వలంటీర్లను ప్రచారానికి వినియోగించుకుంటుండగా.. విశ్వవిద్యాలయాలను రాజకీయ సమావేశాలకు కేంద్రంగా మారుస్తోంది. ఆచార్యులు దగ్గరుండి అధికార పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో గెలిచేందుకు దొంగ ఓట్లను సృష్టిస్తోంది. ఈ దొంగ ఓట్లు (Bogus Voters) మరి ఎలా ఉన్నాయంటే ఒక మహిళకు 18 మంది భర్తలని ఓటరు జాబితాలో ఉంది. ఇది చూసిన సీపీఐ అగ్ర నాయకుడు కె.నారాయణ (K Narayana) విస్మయం వ్యక్తం చేశాడు. అధికార పార్టీ నిస్సిగ్గుగా బరి తెగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ (Andhra Pradesh)లోని తిరుపతి (Tirupati) పట్టణంలో బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ (Communist Party of India -CPI) జాతీయ కార్యదర్శి నారాయణ పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ జాబితాను పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని యశోదనగర్ లో ఓటర్ల జాబితా పరిశీలిస్తుండగా ఓ ఇంట్లో 30, వలంటీర్ (Volunteer) ఇంట్లో 12, మరో ఇంట్లో 8 దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించారు. వీటిని చూసి నారాయణ విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలు అందిస్తున్న వలంటీర్ ఇంట్లో 12 దొంగ ఓట్లు కనిపించడంతో ప్రభుత్వమే దగ్గరుండి దొంగ్ల ఓట్లు నమోదు చేయిస్తోందని రుజువైంది.
ఈ వ్యవహారంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) ప్రజాస్వామ్యాన్ని రోడ్డుపై నిలబెట్టి అపహాస్యం చేస్తున్నాడు. అరాచక పాలనకు అంతే లేకుండా పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికట్లో ఓటమి భయం పట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) దొంగ ఓట్లకు తెరలేపింది. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చే వారి కాళ్లు విరిగొట్టాలి. దొంగ ఓటర్ల జాబితా, అర్హత కలిగిన వారికి ఓటు హక్కు కల్పించకపోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. దీంతోపాటు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తాం’ అని స్పష్టం చేశారు.
‘ఒక మహిళకు 18 మంది భర్తలు ఉన్నట్లు జాబితాలో ఓట్లు నమోదు చేయడం సిగ్గుచేటు. దొంగ్ల ఓట్ల నమోదుకు అనుమతించిన అధికారులను బహిరంగంగా ఉరి తీసినా పాపం లేదు. పట్టభద్రుల ఎన్నికల్లో విద్యార్హత కలిగిన వారికి ఓటు హక్కు కల్పించడం లేదు. పైగా అర్హత లేని వారి పేర్లతో జాబితా రూపొందించడం చాలా దారుణం. పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC Elections) ఎన్నికల సందర్భంగా తిరుపతిలో ఏకంగా 7 వేల దొంగ ఓట్లు ఉన్నాయి’ అని నారాయణ పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులే విజయం సాధిస్తారని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీల తరఫున పీడీఎఫ్ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగారు.