»Cm Jagan And Ap Cabinet Discussed About Vizag As Capital
AP Cabinet విశాఖకే మకాం.. మంత్రివర్గంలో ఇదే ప్రధాన చర్చ
మంత్రివర్గ సమావేశంలోనూ రాజధాని అంశమే ప్రధానంగా చర్చించారు. విశాఖలో చేయాల్సిన పనులు, తరలించాల్సిన కార్యాలయాలు వంటి వాటిపైనే చర్చలు చేశారు. పెండ్లి కానుకల పథకాలైన కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలను ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
రాజధాని మార్పు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. రాజధాని అంశం ఇంకా కోర్టు పరిధిలో ఉండగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) మొండి వైఖరితో బలవంతంగా అమరావతి నుంచి విశాఖపట్టణానికి రాజధానిని తరలిస్తున్నాడు. తాజాగా బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలోనూ (AP Cabinet) రాజధాని అంశమే ప్రధానంగా చర్చించారు. విశాఖలో చేయాల్సిన పనులు, తరలించాల్సిన కార్యాలయాలు వంటి వాటిపైనే చర్చలు చేశారు. విశాఖపట్టణంలో (Vizag) టెక్ పార్కు ఏర్పాటుకు 60 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. కాగా ఇప్పటికే విశాఖ సమీపంలో ఒబెరాయ్ హోటల్ కు భూమిని అద్దె ప్రాతిపదికన కేటాయించింది. ఇలా క్రమంగా విశాఖ కేంద్రంగా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
తాజాగా వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయగా.. పలు సంస్థలు ఏర్పాటు చేయాలని, మండలాల విభజన చేపట్టాలని నిర్ణయాలు తీసుకుంది. పెండ్లి కానుకల పథకాలైన కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలను ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద కొత్తగా ఎనర్జీ పార్కు ఏర్పాటుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో మరో రూ.55 వేల కోట్లు పెట్టుబడితో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో మొదటి దశలో 30 వేల మందికి, రెండో దశలో 31వ వేల మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రివర్గంలో అధికారులు తెలిపారు.
– ఇక కర్నూలు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 2 వేల ఉద్యోగాలు వస్తాయని మంత్రులు తెలిపారు.
– రాజధానిగా మారబోతున్న విశాఖలో టెక్ పార్కు ఏర్పాటుకు 60 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
– వైజాగ్ కేంద్రంగా 100 మెగావాట్ల డేటా కేంద్రం ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది.
– కొత్త విధివిధానంలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
– అప్పుల మీద అప్పులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం కొత్త దారులు వెతుకుతోంది. బందరు పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.3,940 కోట్ల రుణం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. 9.75 శాతం వడ్డీతో ఈ రుణం తీసుకోనున్నారు.
– నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు మారుస్తూ నిర్ణయం.
– గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలు కల్పించాలని నిర్ణయం. యూనిట్ కు రూ.2 చొప్పున రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.
– కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
– తాడేపల్లిగూడెంలో రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు.
– చిత్తూరు డెయిరీ చెల్లించాల్సిన రూ.106 కోట్ల రుణాల మాఫీకి నిర్ణయం.
సినీ ప్రముఖులకు నివాళి
సమావేశం అనంతరం ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, దర్శకుడు సాగర్‌కు మంత్రివర్గం నివాళులర్పించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ తో పాటు మంత్రులు, అధికారులు మౌనం పాటించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.
క్యాబినెట్ సమావేశం అనంతరం ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్ సాగర్‌కు నివాళి అర్పిస్తూ మౌనం పాటించిన రాష్ట్ర మంత్రివర్గం. pic.twitter.com/TjfENXNkgK