ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ (chief minister of andhra pradesh, ys jagan) పైన ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ (ys jagan) ఎక్కడ ఉంటే అక్కడ శనే అని, ఆయన ఓ ఐరన్ లెగ్ అని ధ్వజమెత్తారు. రాజధానిగా ఉన్న అమరావతిని (amaravati) నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడేమో విశాఖ నుండి పాలన చేస్తానని చెబుతున్నారని, ఆయనను చూసి విశాఖ ప్రజలు భయపడే పరిస్థితికి వచ్చిందన్నారు. జగన్ పదవికి ఎక్స్పైరీ డేట్ వచ్చిందని, ఇక పైన ఆయన జన్మలో ముఖ్యమంత్రి కాలేరన్నారు. ఆయన వైయస్సార్ జిల్లా బద్వేలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
నా పార్టీనే నా భవిష్యత్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని టీడీపీ కేడర్ కు పిలుపునిచ్చారు. సాగునీటికి స్వర్గీయ నందమూరి తారక రామారావు చాలా ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు – నగరి తదితర ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత ఆయనదే అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగు దేశం పార్టీ పాత్ర ఎంతో ఉందన్నారు. గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలన్నారు. బంధువులు, రక్త సంబంధీకులు వదిలేసినా కూడా పార్టీ మీ వెంటే ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. రూ.5వేల విరాళం ఇచ్చిన వారికి పార్టీలో జీవితకాల సభ్యత్వం ఉంటుందన్నారు.
జగన్ పాలన పైన ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. ఇచ్చేది 10 రూపాయలు అయితే తీసుకునేది వంద రూపాయలుగా ఉందని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బటన్ నొక్కి రూ.2 లక్షల కోట్లు ఇచ్చానంటున్న జగన్.. మరో రూ.2 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, చంద్రబాబు 73వ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక గీతం ఆవిష్కరించారు. ఆయన జీవన ప్రస్థానంపై ప్రత్యేక కథాగానం చేశారు. దీనిని కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము రూపొందించారు. 6:50 నిమిషాలుగా ఉన్న ఈ గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించారు.