»Buggana Rajendranath Reddy Comments On Ap Capital
Buggana Rajendranath Reddy: 3 కాదు… విశాఖ మాత్రమే రాజధాని
ఆర్థికమంత్రి మాట్లాడుతూ... మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని కాదని, అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra Pradesh Capital) అంశంపై ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) మాట్లాడుతూ… విశాఖను ఏపీ రాజధానిగా పేర్కొన్నారు. ఇది విమర్శలకు దారి తీయడంతో వైసీపీ నేతలు, మంత్రులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రెస్ మీట్లు పెట్టారు. తాజాగా బుగ్గన తమ అధినేత పాటనే పాడారు. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు అంటున్న వైసీపీ అసలు రంగును మరోసారి బయటపెట్టిందని అంటున్నారు. తాజాగా ఆర్థికమంత్రి మాట్లాడుతూ… మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో (Kurnool) న్యాయ రాజధాని కాదని, అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక అమరావతి పేరునే ఆయన ప్రస్తావించలేదు. కర్నాటకలో వలె ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలను గుంటూరులో నిర్వహిస్తామన్నారు. విశాఖలో మార్చి 3, 4వ తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రచారం కోసం బెంగళూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీకి మూడు రాజధానులు అవాస్తవమని, విశాఖ మాత్రమే రాజధాని అని బాంబు పేల్చారు.
పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతాలుగా తిరుపతి, విజయవాడ వంటి నగరాలను ఎందుకు ఎంచుకోలేదని పారిశ్రామికవేత్తలు ప్రశ్నించారు. దీనికి ఆయన రాజధాని అంశంపై స్పందించవలసి వచ్చింది. ‘ఆంధ్రప్రదేశ్ తదుపరి రాజధానిగా విశాఖను తమ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ లేదు. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుండే ఉంటుంది. విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖను ఎంచుకోవడానికి అక్కడి మౌలిక సదుపాయాలు కారణం. భవిష్యత్తులో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది. ఐటీ ఆధారిత పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం. ఐటీకి ఈ నగరం అనువైన ప్రాంతం. ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయి’ అని బుగ్గన చెప్పారు. విశాఖలో ఓడ రేవు, కాస్మోపాలిటన్ నగరం.. ఇలా ఎన్నో కారణాల వల్ల విశాఖ వైపు మొగ్గు చూపినట్లు చెప్పారు. విశాఖను ఐటీ రాజధానిగా చేస్తామని చెప్పారు.
కర్నూలు రాజధాని కాదని, అక్కడ హైకోర్టు బెంచ్ ఉంటుందని బుగ్గన స్పష్టం చేశారు. కర్నాటకలోని దార్వాడ్లో ఒక హైకోర్టు బెంచ్, గుల్బర్గాలో మరో బెంచి ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం వందేళ్ల చరిత్రను గుర్తు తెచ్చుకోవాలని, 1937లో శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం పాలనా రాజధాని ఒకచోట, కోర్టు మరోచోట ఉండాలన్నారు. అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం కోసం, కర్నూలులో ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు.
బెంగళూరులో బుగ్గన వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసినట్లుగా కనిపిస్తోంది. సుప్రీం కోర్టులో ఏమాత్రం తమకు అనుకూలమైన నిర్ణయం వెలువడినా హుటాహుటిన విశాఖ తరలి వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా ఉంది. మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టకుండా రాజధాని మార్పు అనే పదం ప్రయోగించకుండా కార్యాలయ తరలింపు అంటూ అమరావతిలో ఉన్న కార్యాలయాలను విశాఖకు తరలించే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానులు… అభివృద్ధి వికేంద్రీకరణ వెనుక.. అసలు కారణం రాజధాని తరలింపు అంటున్నారు.