»Breaking Kishan Reddy In Police Custody High Tension At Indira Park
Breaking: పోలీసుల అదుపులో కిషన్రెడ్డి.. ఇందిరా పార్క్ వద్ద హైటెన్షన్
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేస్తున్న దీక్ష వద్ద హైటెన్షన్ నెలకొంది. దీక్ష చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ దీక్షకు ఆరు గంటల వరకే పర్మిషన్ ఉందని పోలీసులు వాగ్వాదానికి దిగారు. బీజేపీ కార్యకర్తలందరూ కిషన్ రెడ్డిని చుట్టుముట్టి పోలీసులను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు బీజేపీ అగ్రనేతలు సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బాత్రూంలో మందు తాగి దీక్ష చేశారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన దీక్షను చెడగొట్టడానికి స్టేట్ లోని ఇంటెలిజెన్స్ మొత్తాన్ని హైదరాబాద్ లోకి దించారన్నారు.
అమెరికాలో తెలంగాణ యువకులు హోటళ్లలో పనిచేస్తున్నారని, అక్కడ ఉద్యోగాలు లేక హోటళ్లు, బార్లలో పనిచేస్తున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్ వద్ద పోలీసులు కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గడువు ముగిసినా దీక్ష చేస్తున్నారని పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. దీక్షా శిబిరం వద్ద పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం కిషన్ రెడ్డితో పాటు మరికొందరు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.