»A New Version Of Whatsapp Has Arrived Are You Getting Messages Saying Upgrade To Pink Whatsapp Now
Pink Whatsaap: పింక్ వాట్సాప్ డౌన్ లోడ్ చేసుకున్నారో.. ఇక అంతే
పింక్ వాట్సాప్(Pink Whatsaap) పేరుతో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పాత దానికి అప్ గ్రేడ్ వర్షన్ అని ఇందులో బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయని కేటుగాళ్లు ఊదరగొడతారు.
Pink Whatsaap: టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సైబర్ నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య మీకు ఎప్పుడైనా ‘వాట్సాప్‌కు కొత్త వెర్షన్ వచ్చేసింది. వెంటనే పింక్ వాట్సాప్‌కు అప్‌గ్రేడ్ చేసుకోండి’ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయా?.. తస్మాత్ జాగ్రత్త. పింక్ వాట్సాప్‌ను ఇన్స్టాల్ చేశారో ఫోన్లోని డాటా అంతా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీ వ్యక్తిగత సమాచారాన్ని పట్టుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. పింక్ వాట్సాప్ పేరుతో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పాత దానికి అప్ గ్రేడ్ వర్షన్ అని ఇందులో బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయని కేటుగాళ్లు ఊదరగొడతారు. మనం మెసేజ్ చేస్తే పేరు కూడా కనిపించదని, బ్లూటిక్స్ అనే ఆప్షన్లు లేకుండా సెట్టింగ్స్ మార్చుకోవచ్చని, వాట్సాప్ కాల్స్ రికార్డు చేసుకోవచ్చని, నచ్చనివారి ఫొటోలను ఈజీగా మార్ఫింగ్ చేసుకోవచ్చని ఇలా ఆప్షన్లను కళ్లకు కట్టినట్లు చెప్పేస్తారు.
ఆ ప్రకటనలకు మనం పడిపోతే అంతే సంగతులు. యాప్‌ను ఇన్స్టాల్ చేయగానే, ఇతర యాప్స్, ఫొటోలు, గ్యాలరీ, కెమెరా యాక్సెస్‌కు పర్మిషన్లు అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేస్తే.. ఆ వాట్సాప్ పింక్ కలర్లో తప్ప ఇతర ఏ ఆప్షన్లు కనిపించవు. ఆ విషయం తెలిసేలోగానే ఫోన్లోని సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. దాంతో ఆగకుండా కొన్ని ప్రమాదకర వైరస్లు పంపి ఫోన్‌ను హ్యాక్ కూడా చేసేస్తారు. ఉత్తర భారతదేశంలో ఇలాంటి మోసాలు విరివిగా వెలుగులోకి వస్తున్నాయి. వీరి భారిన పడి అమాయకులు లక్షలు సమర్పించుకుంటున్నారు.
పింక్ వాట్సాప్ అనేది ఘరానా మోసం. మీరు గనక ఇన్ స్టాల్ చేసుకుంటే వెంటనే దానిని అన్ఇన్స్టాల్ చేసుకోండి. ముందుగా పింక్ వాట్సాప్ అప్లికేషన్‌ను సైబర్ నేరగాళ్లు స్కామర్లకు కొంత డబ్బుకు అమ్ముకుంటారు. ఆ స్కామర్లు బల్క్ మెసేజ్‌లతో సామాన్యులను టార్గెట్ చేస్తూ వారి సమాచారం దొంగిలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కోసారి డబ్బులు ముట్టిన తర్వాత సైబర్ నేరగాళ్లు స్కామర్లకు నకిలీ లింకులు పంపి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలెవరైనా ఇలాంటి సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కి కాల్ చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయండి.