VSP: మధురవాడలో అండర్‌గ్రౌండ్ కేబుల్ పనుల పేరుతో రోడ్లు తవ్వి వదిలేయడంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంపాలెం ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రహించారు. 15 రోజుల్లో పూడ్చగలిగితేనే గోతులు తీయాలని, లేకపోతే పనులు ప్రారంభించవద్దని కాంట్రాక్టర్లను హెచ్చరించారు.
KDP: నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మహిళలను అవమానించేలా, పార్టీ మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు వార్తలు ప్రచురించారని ఆరోపించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, CEC సభ్యుడు కే. సురేష్ బాబు ఆధ్వర్యంలో ఫిర్యాదు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ATP: ఎన్.హెచ్ 544డి పరిధిలో నెలకొన్న భూసమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సోములదొడ్డి నుంచి బుగ్గ వరకు సాగుతున్న భూసేకరణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుక్కరాయసముద్రం, సింగనమల, తాడిపత్రి తదితర మండలాల్లోని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
VSP: గిరిజన రైతులకు ఆర్థిక భద్రత, మార్కెట్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. బుధవారం విశాఖలో ఆమె సమీక్షా నిర్వహించారు. గిరిజన రైతులు సేకరించే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు వల్లే కాఫీకి మంచి బ్రాండ్ వచ్చిందన్నారు.
కోనసీమ: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యమని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి కమిటీతో జరిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపన, స్వయం ఉపాధి మెరుగుపరచడంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
VSP: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జీవీఎంసీ నగరంలోని 10 జోన్లలో 198 చలివేంద్రాలు, 52 గ్రీన్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం అదనపు కమిషనర్ పి. నల్లనయ్య తెలిపారు. హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించి అధికారులతో సమీక్షించారు. చలివేంద్రాల్లో తాగునీరు, ORS ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు.
KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో కౌతాళం మండలం ఎరిగేరి పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. గోస్పాడు(M) సాంబవరంలో నిర్వహించిన ఈ టోర్నీలో జిల్లా వ్యాప్తంగా 58 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ పోరులో అద్భుత ప్రతిభ కనబర్చిన ఎరిగేరి విద్యార్థులు ప్రథమ బహుమతితో పాటు ట్రోఫీని గెలుచుకున్నారు. విజేతలను నిర్వాహకులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.
NDL: డోన్ మండలం కొత్తబురుజు గ్రామానికి గురువారం నూతన తాగునీటి పైప్ లైన్ శంకుస్థాపనకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డితో పాటు కలెక్టర్ రాజకుమారి హాజరవుతున్నారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు.
W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ కో ఆర్డినేటర్ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అత్యధిక స్థానాలు సాధించాలని పిలుపు నిచ్చారు.
CTR: కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు రెండవ విడత అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు, మీడియాపై దాడుల నివారణపై కాసేపు చర్చించారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ప్రతి బుధవారం జరిగే వారపు సంత ఈసారి వెలవెలబోయింది. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దగా రాకపోవడంతో వ్యాపారం మందగించింది. ఎండలు అధికంగా ఉండటంతో కొనుగోలుదారులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
KKD: గొల్లప్రోలులోని మొగలి సూర్యుడు మంచినీటి చెరువు అభివృద్ధికి వెంటనే డీపీఆర్ సిద్ధం చేయాలని పాడా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ శివప్రసాద్ బుధవారం ఆదేశించారు. పబ్లిక్ హెల్త్ ఈఈ ధర్మతేజతో కలిసి ఆయన చెరువును పరిశీలించారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న ఈ పనులు ఇప్పటివరకు ముందుకు సాగకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
AKP: నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రతివారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ తెలిపారు. ఎలమంచిలిలో బుధవారం నిర్వహించిన జనవాణిలో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే అర్జీ దారులతో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
VZM: సీతం కళాశాలలో ఉచిత పాలిసెట్ (POLYCET) కోచింగ్ తరగతులు ఇవాళ ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇది ఒక విలువైన అవకాశమని డైరెక్టర్ డా మజ్జి శశి భూషణరావు తెలిపారు. పరీక్షలో విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించేందుకు అవసరమైన సమగ్ర శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
KRNL: దిన్నదేవరపాడు వద్ద ఉన్న జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో జరుగుతున్న ఎస్సై పదోన్నతి ఎంపిక పరీక్షలను బుధవారం ఐజీ, అనంతపురం రేంజ్ ఇంఛార్జ్ డీఐజీ డా. షిమోషి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. రాయలసీమ జోన్‌కు చెందిన 72 మంది ఏఎస్సైలకు డ్రిల్, ఆయుధాల పరిజ్ఞానం, నేరస్థల పరిశీలన, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పించనున్నట్లు తెలిపారు.