W.G: హైదరాబాద్ నుంచి పెనుగొండ వాసవి ధామం దర్శనానికి వచ్చిన యాత్రికులు డీజిల్ కొరతతో సోమవారం పాలకొల్లులో నిలిచిపోయారు. తిరుగు ప్రయాణం కోసం బస్సులకు ఇంధనం దొరక్కపోవడంతో బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నామని యాత్రికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు డీజిల్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
NTR: కంచికచర్ల మండలంలో పరిపాలన మార్పులు చోటుచేసుకున్నాయి. మండల తహశీల్దార్ సిహెచ్ నరసింహారావు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఏలూరు జిల్లాకు బదిలీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ తహశీల్దారుగా మానస బాధ్యతలు స్వీకరించారు.
KRNL: ఆదోనిలో మైనారిటీల అంశాలపై మాట్లాడేటప్పుడు ప్రజాప్రతినిధులు బాధ్యతతో వ్యవహరించాలని ఇవాళ మగ్ధుం భాష అన్నారు. ప్రెస్‌మీట్లు స్పష్టంగా, అసలు సమస్యలపై కేంద్రీకృతంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా సమాజానికి ఉపయోగపడే చర్చలు జరగాలని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, పారదర్శక ఎన్నికలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
NDL: మహానంది మండలం బొల్లవరం మైనార్టీ కాలనీలో సోమవారం తాగునీటి పైపులైన్ లీకేజీతో నీరు వృథాగా పోతోంది. కొత్త మసీదు సమీపంలో పైపు పగలడంతో ఇళ్లకు సరఫరా తగ్గి, రోడ్డుపై నీరు నిలిచి మురుగును తలపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు వృథా కాకుండా, రహదారిపై నీటి నిల్వలను తొలగించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర మార్నింగ్ విజిట్‌లో భాగంగా నగరంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. 12వ డివిజన్‌లో చెత్త కుప్పగా ఉన్న ప్రాంతం హెచ్చరిక బోర్డుల వల్ల శుభ్రంగా మారినట్లు గుర్తించారు. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం వద్దని అధికారులను ఆదేశించారు. అకస్మిక తనిఖీలను మరింత పెంచాలని సూచించారు.నగర శుభ్రతకు ప్రజల సహకారం తప్పనిసరి అని తెలిపారు.
PLD: నరసరావుపేటలో శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో చంద్రా & ప్రమీల నల్లపాటి కళాపరిషత్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాటిక పోటీలలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము తదితరులు హాజరయ్యారు.
ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వెంకటాపురం సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. నిత్యం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడిపే ఆమె, తన పొలంలో సాగుతున్న పంటలను స్వయంగా పరిశీలించారు. పంటల ఎదుగుదల, సాగు విధానాల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు పొలంలో కలియతిరిగి మొక్కల పరిస్థితిని గమనించారు.
PLD: సత్తెనపల్లి మండలంలోని భృగూబండ గ్రామంలో ప్రేమ విఫలమైందని జమాళ్లమూడి చందు (24) అనే యువకుడు ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గమనించిన ఇంటి పక్కన వారు అతన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల కథనం ప్రకారం.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AKP: నాతవరం జనసేన పార్టీ కార్యాలయంలో ఇవాళ ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించారు. నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సూర్యచంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మండలంలో మొత్తం 9 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వై.వెంకయ్యపాలెం చెరువులో ఉపాధి హామీ పనులకు కొందరు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని, దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తామని చెప్పారు.
సత్యసాయి: ఆమడగూరు మండల తహసీల్దార్ రామ్నాథరెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నంద్యాలలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామ్నాథరెడ్డి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.
PLD: నరసరావుపేట రావిపాడులోని పెట్రోల్ బంక్‌ను కలెక్టర్ డా. కృతికా శుక్లా ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంక్‌లో ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులు, రికార్డులను స్వయంగా పరిశీలించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
SKLM: భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ శ్రీకాకుళం నగరానికి భారత వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. డచ్ బంగ్లా హెలిపాడ్ వద్ద కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజర రామ్మోహన్ నాయుడు ఉపరాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌కి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా శ్రీకూర్మం వెళ్తారని అధికారులు తెలిపారు.
KDP: ప్రొద్దుటూరులో రాజకీయాలు హీటెక్కాయి. TDP, YCP నేతల మధ్య ప్రతిరోజూ మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో మీడియాను, అధికారులను సైతం లాగుతున్నారు. అంతేకాకుండా MLA వరద, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ దూషణలకు దిగుతున్నారు. ప్రైవేటు పంచాయితీలంటూ ఒకరిపై ఆరోపణలు చేసుకుంటున్నారు.
నెల్లూరు రూరల్ జొన్నవాడ బ్రిడ్జి ఆర్చి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును బొలెరో వాహనం ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు కొండలపూడి గ్రామానికి చెందిన సునీల్ (25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: తడి, పొడి చెత్తలను వేరుచేసి పంచాయతీ శానిటేషన్ వాహనాలకు అందజేయాలని ప్రజలకు, దుకాణదారులకు చీపురుపల్లి పంచాయితీ EO రూన్సీరాణి ఇవాళ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెత్తను వేరు చేసేందుకు గతంలో పంచాయితీ అందజేసిన ప్లాస్టిక్ బుట్టలను ఉపయోగించాలన్నారు. చెత్తను వేరు చేసి ఇవ్వడం వల్ల సంపద కేంద్రాలు సమర్ధవంతంగా పని చేయగలవని తెలిపారు.