ELR: కైకలూరులో గత రాత్రి జరిగిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఛైర్మన్‌గా ప్రమాణం చేసిన పెన్మెత్స త్రినాధరాజుకు అభినందనలు తెలిపారు. రైతులకు మార్కెట్ యార్డ్ ద్వారా మరింత మెరుగైన సదుపాయాలు అందేలా కృషి చేయాలని, వ్యవసాయ రంగం అభివృద్ధికి ఛైర్మన్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
అన్నమయ్య: ములకలచెరువు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 30న నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో రమణ ప్రకాష్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. మండల అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.
BPT: సంతమాగులూరు మండల పరిధిలోని కొమ్మాలపాడు జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ ఆటోను బలంగా ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, స్థానిక పోలీసులు గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు కర్నూలు ఆర్ఐవో లాలప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫెయిలైన విద్యార్థులు, ఇంప్రూమెంట్ రాసే విద్యార్థులు ఈనెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ ఫీజును ప్రకటించిన తేదీల్లోనే చెల్లించాలని తెలిపారు.
CTR: వీకోట పట్టణంలో ఓ పత్రిక విలేఖరి జగన్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరోత్సవం స్థానిక హుకుంపేటలో సోమవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఘటాలను దర్శించుకుని పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం చిత్ర, విచిత్ర వేషధారణలతో అంగరంగ వైభవంగా ఘటాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అర్ధరాత్రి తర్వాత మూడు లాంతర్ల వద్దనున్న చదరుగుడిలో ప్రతిష్టించారు.
ATP: జిల్లాలో గత 24 గంటల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా రెండు మండలాల్లో వర్షం కురిసింది. బొమ్మనహాల్ మండలంలో గరిష్ఠంగా 13.2 మి.మీ, డీ హీరేహాల్ మండలంలో 9.8 మి.మీ వర్షపాతం రికార్డయ్యింది. జిల్లా మొత్తం 23 మి.మీ వర్షం కురవగా, సగటున 0.7 మి.మీగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
నెల్లూరు: కావలి పట్టణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి పర్యటించారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు రైల్వే అండర్ పాస్‌ను పరిశీలించారు. ఉదయగిరి రోడ్డు నుంచి ఐడీఎస్ఎంటీ లేఅవుట్ వరకు కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. దీంతో వెంగళరావు నగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
సత్యసాయి: ధర్మవరంలో శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి రథోత్సవం బుధవారం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. రథోత్సవం కోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు క్రమశిక్షణతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు.
KDP: ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయంలోని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సోమవారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. గణపతి, నవగ్రహ, రుద్ర, దీక్ష హోమాలను నిర్వహించారు. గంగా గౌరీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను రావణబ్రహ్మ వాహనంపై కొలువు దీర్చారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఊరేగించారు.
ASR: అరకులోయలో వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, కరతాళ ధ్వనుల మధ్య సాగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వేంకటేశ్వరస్వామి అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్ల మెడలో మంగళ్యధారణ చేశారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణం “గోవిందా” అనే నామస్మరణతో మారుమ్రోగింది.
తూ.గో: సీతానగరం మండలం మునికూడలి, కాటవరం ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు పేర్కొన్నారు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లేక రోడ్లు దెబ్బతిని, పర్యావరణానికి నష్టం కలుగుతోందన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి మంగళవారం ఆలమూరు మండలం జొన్నాడ వాస్తవ్యులు గొలుగూరి సత్తిరెడ్డి, అనంతలక్ష్మి వారి కుటుంబ సభ్యులు రూ. 1,00,151 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతలకు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.
KRNL: తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్న జనగణన-2027లో భాగంగా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ విధానాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఏ.సిరి సూచించారు. ఈ విధానం ద్వారా ప్రతీ కుటుంబం తమ ఇంటి వివరాలను మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా వెబ్సైట్ www.se.census.gov.inలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
NTR: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) కుమార్ సోమవారం రాత్రి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంక్, హెచ్.పీ, భారత్ పెట్రోల్ బంకులను ఆయన స్వయంగా సందర్శించారు. వాహనదారులకు, ముఖ్యంగా రైతులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఇంధన పంపిణీ జరగాలని బంక్ యజమానులకు, సిబ్బందికి ఆర్డీఓ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ కొరతలేదని చెప్పారు.