AKP: పాయకరావుపేటలో పనిచేస్తున్న ప్రైవేట్ వర్కర్లకు సైబర్ క్రైమ్, పోక్సో యాక్ట్ పై సీఐ అప్పన్న మంగళవారం అవగాహన కల్పించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ASI పురుషోత్తం, సిబ్బంది పాల్గొన్నారు.
VZM: కొత్తవలస కూడలిలో వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు దుకాణం ముందు మూడురోడ్లు కనబడేలా సీసీ కెమెరాలను ఆమర్చుకోవాలని సీఐ టి.వి. విజయ కుమార్ మంగళవారం సూచించారు. సీసీ కెమెరాలు మూడో నేత్రంతో సమానమన్నారు. వీటి ద్వారా దొంగతనాల చెక్ పెట్టవచ్చని తెలిపారు. అంతే కాకుండా విలువైన వస్తువులు కాపాడుకోవచ్చని చెప్పారు.
ATP: అనంతపురం జిల్లాలో మే 3న నీట్ (యూజీ) పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8 కేంద్రాల్లో 3616 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణకు జిల్లా రెవెన్యూ అధికారి మలోలను నోడల్ ఆఫీసర్‌గా కలెక్టర్ ఆనంద్ నియమించారు. అభ్యర్థులు పరీక్ష సమయం కంటే ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సింగపూర్ పర్యటన ముగిసింది. ఇవాళ ఆయన సహచర మంత్రులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. వివిధ అంశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి బీసీని ప్రత్యేక కమిటీలో భాగం చేసి సింగపూర్ పర్యటనకు పంపింది. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఆయన CMకు నివేదిక అందించనున్నారు.
NDL: జిల్లాలోని పలు మండలాల్లో ఇవాళ సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సిరివెళ్ల మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో పిడుగు పడటంతో కొబ్బరి చెట్టుపై మంటలు చెలరేగాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడే వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం కురుస్తున్నప్పుడు బయటకు రావద్దని, చెట్ల కింద ఆశ్రయం పొందకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
KRNL: గూగుల్ డేటా సెంటర్, క్వాంటం వ్యాలీతో రాష్ట్ర దశ మారుతుందని మంగళవారం మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్ మార్చే గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. జగన్‌కు క్రెడిట్ చోరీ అలవాటైందని విమర్శించారు. ఏపీ నుంచి పరిశ్రమలను తరిమేశారని.. మెడికల్ కాలేజీల టెండర్లను అడ్డుకున్నారని ఆరోపించారు.
PPM: గర్భిణీ స్త్రీల్లో హైరిస్క్ సమస్యలను సకాలంలో గుర్తించి సురక్షిత ప్రసవాలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మాతా, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించి, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. గర్భిణీలు సమయానికి పరీక్షలు చేయించుకుని పోషకాహారం తీసుకోవాలన్నారు.
W.G: విద్యుత్ కోతలు, డీజిల్ కొరత ఆక్వా రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ అందించే ఏరియేటర్లు తిరగాలంటే విద్యుత్ తప్పనిసరి. కరెంటు లేని వేళ జనరేటర్లే దిక్కుకాగా, మార్కెట్లో డీజిల్ దొరకక సాగు భారమవుతోంది. కొల్లేరు వంటి ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ELR: దెందులూరు నియోజకవర్గ పరిధిలోని రైతులకు ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల తాహసీల్దారుల పర్యవేక్షణలో వ్యవసాయ అధికారుల ద్వారా ప్రత్యేకంగా ఇంధన కూపన్లు అందించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నమన్నారు.
CTR: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ గాంజా, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. పదేపదే నేరాలకు పాల్పడిన 16 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన రూ.5.32 కోట్ల విలువైన 1064 కిలోల గంజాయిని చట్టపరంగా దగ్దం చేశారు. ఈ ప్రక్రియను అనంతపురం రేంజ్ ఐజీ డా.షిముషి బాజ్‌పాయి పర్యవేక్షించారు.
TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం బుచ్చి నాయుడు కండ్రిగ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా మండలంలోని పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
TPT: వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు కమ్మ వీధిలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఎంపీడీవో విజయమ్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకుని, సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
E.G: దేవరపల్లి జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిలో కోడిగుడ్లు లోడుతో రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చున్నారు. కాగా డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
బాపట్ల జిల్లాలో పోలీసులు చోరీ కేసును ఛేదించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దొంగల గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితుల నుంచి ఏకంగా రూ.26 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బాపట్ల జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల సమస్యలు వెల్లువెత్తాయి. టీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మహిళా గ్రీవెన్స్‌లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మహిళల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఉపాధి, ఆరోగ్యం, భద్రత, మంచినీరు, చోరీలు, చిట్టీల మోసాలు వంటి సమస్యలతో మహిళలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు.