KRNL: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. సోమవారం కోడుమూరు నియోజకవర్గానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు తన కార్యాలయంలో రూ. 4,62,934 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రమాదాలతో పాటు అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని సీఎం చంద్రబాబు ఆదుకుంటున్నారని ఆయన అన్నారు.
కోనసీమ: డీజిల్, పెట్రోల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం ఎస్పీ రాహుల్ మీనా, జేసీ లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని పెట్రోల్ బంకులు సాయంత్రం 7 గంటల లోగా సాధారణ స్థితికి వస్తాయన్నారు. వదంతులు నమ్మవద్దని సూచించారు. బంక్‌ల యజమానులతో మాట్లాడుతున్నామన్నారు.
NDL: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు నిలిపివేశారు.
PLD: చిలకలూరిపేటలో ఇంధన కొరత లేదని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు స్పష్టం చేశారు. ఇవాళ పలు బంకులను ఆయన తనిఖీ చేసి, అన్ని బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. సోషల్ మీడియా వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని బంకుల యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రజలు అవసరమైన మేరకే ఇంధనం కొనాలని సూచించారు.
PPM: దివ్యాంగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని జిల్లా రెవిన్యూ అధికారి కే హేమలత అన్నారు. ఇవాళ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సమావేశం మందిరంలో అర్జీదారుల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. ఆ సందర్భంగా DRO మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కొరకు ప్రభుత్వం పథకాలు పెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
AKP: అనకాపల్లి నెహ్రూ చౌక్ కూడలిలో గల బుద్ధుని విగ్రహం వద్ద సిద్ధార్థ సోషల్ సర్వీస్ & కల్చరల్ అసోసియేషన్ ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బుద్ధ జయంతిని ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ సెలవు దినంగా ప్రకటించడం ద్వారా ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చన్నారు.
ELR: డీజిల్ నిల్వల కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. జిల్లా ప్రజల అవసరాల మేర డీజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. బంకులలో డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోకుండా ఒకరోజు ముందుగానే ట్యాంకర్లను బుక్ చేయాలనీ సోమవారం బంకు యాజమాన్యాలకు సూచించారు. రబీ ధాన్యం తరలించే వాహనాలు, ఆక్వా కి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
GNTR: మంగళగిరిలో జరిగిన జిల్లా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో తెనాలికి చెందిన 9వ తరగతి విద్యార్థి వడ్డేపల్లి కార్తీక్ గౌరీనాధ్ సత్తాచాటాడు. 105 కేజీల సబ్‌జూనియర్ విభాగంలో 275 కిలోలు ఎత్తి బంగారు పతకం సాధించాడు. ఆల్‌రౌండ్ విభాగంలో కాంస్యాన్ని అందుకొని ద్విపతక విజయం నమోదు చేశాడు. ఈ మేరకు పలువురు అతన్ని అభినందించారు
పార్వతీపురంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటన సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి, ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
CTR: విజయపురం మండలం ముత్యాల రెడ్డి కండ్రిగ నుంచి క్షురికాపురం వరకు ప్రభుత్వం రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులు కీలకమని, ఈ రోడ్డు ద్వారా స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.
KDP: బద్వేల్ డివిజన్‌లో పెట్రోల్,డీజిల్ కొరతపై ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్డీవో చంద్రమోహన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒక్కరికీ గరిష్టంగా 2 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కార్లకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, భారీ వాహనాలకు 100 లీటర్ల పరిమితి విధించారు. డ్రమ్ముల్లో నిల్వ చేసుకోవడం, ఫుల్ ట్యాంక్ నింపడం కొద్ది రోజులపాటు నిషేధించారు.
KRNL: పెట్రోల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ, రవాణా సేవలు ఎక్కడా ఆగకూడదని సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. రవాణా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉండి, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
కృష్ణా: పర్గుడివాడలో ఇటీవల ప్రారంభించిన రెడ్యూస్, రీయూస్-రీసైకిల్ కేంద్రానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మున్సిపల్ కమిషనర్ మనోహర్ స్వయంగా, 15 కిలోలకు పైగా ఉపయోగించగలిగే బట్టలు, పిల్లల బొమ్మలు, పలు ఎలక్ట్రికల్ పరికరాలను విరాళంగా అందజేశారు. ప్రజలు, ఉద్యోగులు ఇలాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలన్నారు.
W.G: హైదరాబాద్ నుంచి పెనుగొండ వాసవి ధామం దర్శనానికి వచ్చిన యాత్రికులు డీజిల్ కొరతతో సోమవారం పాలకొల్లులో నిలిచిపోయారు. తిరుగు ప్రయాణం కోసం బస్సులకు ఇంధనం దొరక్కపోవడంతో బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నామని యాత్రికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు డీజిల్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
NTR: కంచికచర్ల మండలంలో పరిపాలన మార్పులు చోటుచేసుకున్నాయి. మండల తహశీల్దార్ సిహెచ్ నరసింహారావు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఏలూరు జిల్లాకు బదిలీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ తహశీల్దారుగా మానస బాధ్యతలు స్వీకరించారు.