BPT: ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజులుగా తీవ్రమైన డీజిల్ కొరత నెలకొందని, దీనివల్ల అంబులెన్స్‌లు, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.
తూ.గో: మరణించిన కానిస్టేబుల్ వెల్లా ప్రసాద్ కుటుంబానికి జిల్లా పోలీసులు అండగా నిలిచారు. ఎస్పీ డి. నరసింహ కిషోర్ రూ. లక్ష అంత్యక్రియల కోసం, వెల్ఫేర్ ఫండ్ నుండి రూ. 25 వేలు అందజేశారు. 2012 బ్యాచ్ కానిస్టేబుళ్లు రూ. 4.04 లక్షలు సేకరించి కుటుంబానికి అందించారు. క్లిష్ట సమయంలో సహచర సిబ్బంది చూపిన ఈ మానవత్వం ఆ కుటుంబానికి కొండంత భరోసాను ఇచ్చింది.
SKLM: పాతపట్నంలో షటిల్ బ్యాడ్మింటన్‌లో బుధవారం నుండి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో శిక్షణ ఇస్తామని ఆసక్తి ఉన్న వారు హాజరు కావాలని నిర్వాహకుడు మడ్డు ప్రకాశ్ తెలిపారు. వివరాలకు 9603306440, 95154 51440 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కాకినాడ: సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద గల భారత్ పెట్రోలియం బంకులో సోమవారం సాయంత్రం రైతులకు ప్రత్యేకంగా డీజిల్ పంపిణీ చేశారు. ఆటోలకు, రైతులకు టోకెన్లు ఇచ్చి క్యూ పద్ధతిలో ఇంధనం అందజేశారు. ప్రతి రైతుకు 70 లీటర్ల డీజిల్ పరిమితి విధించారు. పెట్రోల్ స్టాక్ రావాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు. పంపిణీ సజావుగా సాగేందుకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
KRNL: జిల్లాలో తొమ్మిది రోజులకు సరిపడా పెట్రోల్, ఆరు రోజులకు అవసరమైన డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి సోమవారం సాయంత్రం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. వాహనాల ఇంధన వినియోగంపై కొన్ని పరిమితులు విధించినట్లు స్పష్టం చేశారు.
NTR: విస్సన్నపేట మండలం పుట్రేల శివారు వీరరాఘవపురం గ్రామ వాస్తవ్యులు గాదే వెంకటేశ్వరరావు (GVR) సామాజిక సేవ అంశంలో తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డును పొందారు. ఈ సందర్భంగా విస్సన్నపేటలో కూటమి నాయకులు ఆయనను శాలువాతో అభినందించి సత్కరించారు. అనంతరం సామాజిక సేవలో మరింత ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు.
ELR: కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కైకలూరులోని మార్కెర్ యార్డు కమిటీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో ముఖ్య అతిధులుగా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ యార్డు నూతన పాలకవర్గంగా ప్రమాణస్వీకారం చేసిన ఛైర్మన్‌కి, డైరెక్టర్లందరికీ అభినందనలు తెలిపారు.
AKP: టీడీపీ ముసుగులో పనిచేస్తున్న వైసీపీ కోవర్టులను తక్షణం సస్పెండ్ చేయాలని అనకాపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కర్రి బాబ్జి కోరారు. అనకాపల్లిలో సోమవారం మాట్లాడుతూ.. మండలానికి చెందిన ఓ నాయకుడు టీడీపీకి వెన్నుపోటుదారుడిగా మారినట్లు ఆరోపించారు. ఆ నేత టీడీపీకి చెందిన నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు.
కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు ఈదరపల్లిలో వద్ద జరిగే వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక క్యాంపు కార్యాలయం నందు డ్వాక్రా మహిళకు పీఎం అజయ్ లోన్లు, యానిమేటర్లకు సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
TPT: నాగలాపురం ప్రసిద్ధ వేదనారాయణ స్వామి ఆలయంలో ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పవిత్రత కోసం నిర్వహించే ఈ శుద్ధి కార్యక్రమంలో అంతర్భాగాలను సుగంధ ద్రవ్యాలు, ఔషధ పదార్థాలతో శుభ్రపరచి, అనంతరం ప్రత్యేక పూజలు చేపడతారు. ఈ కార్యక్రమం సందర్భంగా కొంతసేపు దర్శనం నిలిపివేయనున్నందున భక్తులు సహకరించాలని కోరారు.
BPT: బల్లికురవ మండల పరిధిలోని కూకట్లపల్లి గ్రామంలో నివాస స్థల వివాదానికి సంబంధించి సోమవారం సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంజిరెడ్డి తన నివాస స్థలం విషయంలో వివాదం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన పేరి రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
GNTR: ఆర్టీసీ బస్టాండు పార్సిల్ కార్యాలయంలోని పార్సిళ్లకు ఈ నెల 30న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్తులు చెల్లించి, ఎవరైనా పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
కర్నూలు నగరంలో పారిశుద్ధ్య పనులను పక్కా ప్రణాళికతో నిర్వహించాలని కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. సోమవారం సాయంత్రం పలు వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును పరిశీలించారు. చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విధుల్లో క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేయాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు.
GNTR: పోలీసునని నటిస్తూ విద్యార్థినిని బెదిరించి అత్యాచారం చేసిన వ్యక్తిపై జిల్లా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. గోపి అనే వ్యక్యికి 10 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.23 వేల జరిమానా విధించింది. ఇప్పటికే 29 కేసులు ఉన్న నిందితుడిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. బాధితురాలికి రూ.1లక్ష పరిహారం అందజేయాలని ఆదేశించింది.
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో తాగునీటి సరఫరాపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నకరికల్లు చెరువులో నీటి నాణ్యతను ఎస్ఈ, కమిషనర్ రమ్య కీర్తన, డీఈ రఫీ పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.