TPT: తిరుపతి నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 27 వినతులు అందాయని అదనపు కమిషనర్ శారదా దేవి తెలిపారు. కార్యాలయానికి నేరుగా 23 మంది, ఫోన్ ద్వారా 4 మంది తమ సమస్యలు తెలియజేశారు. వాకర్స్ వే ఆక్రమణలు, కాలువ నిర్మాణం, త్రాగునీటి సమస్యలు, చెత్త నిర్వహణ వంటి అంశాలపై వినతులు రావడంతో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
AKP: క్లాప్ మిత్రలు ప్రతిరోజు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలించాలని ఎస్ రాయవరం మండల డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ సూచించారు. సోమవారం పెట్టగోళ్లపల్లిలో చెత్త సేకరణపై క్లాత్ మిత్రలకు అవగాహన కల్పించారు. గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అలాగే, మురికి కాలువలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలన్నారు.
KRNL: కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి కలెక్టర్ డా.సిరి అర్జీలు స్వీకరించారు. PGRS అర్జీలు రీ-ఓపెన్ కాకూడదని, అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నూరుల్, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు.
గుంటూరు జిల్లా నూతన PGRS భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని ప్రజల నుంచి 146 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని నిర్ణీత కాలంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫిర్యాదుదారులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించగా, పోలీస్ సిబ్బంది సహకరించారు. ప్రజలు నిస్సంకోచంగా తమ సమస్యలు తెలియజేయాలని ఎస్పీ సూచించారు.
W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను సోషల్ అడిట్ బృందం సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేసింది. తాడేపల్లిగూడెంలోని వెంక్రమన్నగూడెం, రామన్నగూడెం, గ్రామలతో పాటు పెంటపాడు మండలం కోరుమిల్లి, రామచంద్రాపురం గ్రామాల్లో 6 రోడ్లను సోషల్ అడిట్ బృందం పరిశీలించింది. నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేసింది. సాంకేతిక నిపుణులు కొలతలను సేకరించారు.
VZM: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను సోమవారం జిల్లా కోర్టు విధించింది. తెర్లాం మండలానికి చెందిన హరికృష్ణపై ఆరోపణలు రుజువవడంతో రూ.3,000 జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేసింది. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.
PLD: కలెక్టర్ కార్యాలయాన్ని భాష్యం పాఠశాల విద్యార్థులు సందర్శించారు. కార్యాలయ పనితీరును తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని విభాగాల పనితీరు, ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదుల స్వీకరణ విధానం గురించి విద్యార్థులకు వివరించారు.
KRNL: ఉపాధి కూలీలకు తలనొప్పగా మారిన ఫేస్ యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న డిమాండ్ చేశారు. ఇవాళ MPDO ప్రభావతి దేవికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ పథకంలో రాజకీయ నాయకుల జోక్యం, రెండు పూటల పని విధానాన్ని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ATP: విరక్తి గవి మఠం ఉత్తరాధికారి నివాసం కోసం సొంత నిధులతో నూతన భవనాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హామీ ఇచ్చారు. సోమవారం బసవ జయంతి సందర్భంగా కళ్యాణస్వామి సమక్షంలో ఆయన భూమిపూజ నిర్వహించారు. మఠం ఆస్తులు అన్యాక్రాంతం కావడంతో వసతి ఇబ్బందులు తలెత్తాయని, వీటిని పరిష్కరించేందుకు భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం మహాత్మా బసవేశ్వర జయంతి ఘనంగా జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారి విజయకుమార్, తదితరులు బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… బసవేశ్వరుడు గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త అని కొనియాడారు.
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని సోమవారం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
BPT: మండల కేంద్రమైన నిజాంపట్నం నూతన సబ్ ఇన్స్పెక్టర్గా జీ. కిరణ్ బాబు సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వచ్చిన ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో స్నేహపూర్వకంగా ఉంటామని, శాంతిభద్రతల పరిరక్షణే తన మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేశారు.
ప్రకాశం: ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో జోన్-4 ప్రచార విభాగం విస్తృత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. కనిగిరి ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ పాల్గొని, ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తల పాత్ర కీలకమని తెలిపారు. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించిందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నదని ఆరోపించారు.
కర్నూలు: విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. భూ వివాదంలో న్యాయం చేయాలని కర్నూలు, మేడం కాంపౌండ్‌కు చెందిన రామలక్ష్మమ్మ జిల్లా ఏస్పీకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
GNTR: వేసవి వేడిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆటో డ్రైవర్ దేవ తన సర్వీస్ ఆటోలో ‘మొబైల్ వాటర్ ట్యాంక్’ ఏర్పాటు చేసి సేవ చేస్తున్నాడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ A. హనుమంతు దీన్ని ప్రారంభించి ఆయన సేవా భావాన్ని అభినందించారు. ప్రతి ఏడాది ఇలా ముందుకు వస్తున్న దేవ సామాజిక బాధ్యతకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు.