ప్రకాశం: పొదిలి SI రాజేశ్ ఇవాళ ఉదయం పట్టణంలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతల్లో సరైన ప్రమాణాలు పాటిస్తున్నారా అని పరిశీలించారు. బంక్ యాజమాన్యాలకు వినియోగదారులను మోసంచేసే అక్రమాలు చేయకూడదని హెచ్చరించారు. మీటర్లు సరిగా పనిచేస్తున్నాయా, సరైన పరిమాణంలో ఇంధనం అందిస్తున్నారా అని ప్రత్యేక దృష్టి సారించారు.
KRNL: రాష్ట్ర అభివృద్ధి సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలులో ఇవాళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్రాన్ని ఐదేళ్లలో దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
E.G: పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యా మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన చదువు, మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ ITDP అధ్యక్షులు అబ్బిశెట్టి సత్తిరాజు, పాఠశాల కమిటీ ఛైర్మన్ రెడ్డి దుర్గ, ఉపాధ్యాయురాలు వై.అశ్విని ఉన్నారు.
ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఇవాళ సాయంత్రం 5గం.తో ముగుస్తుందని అల్లూరి జిల్లా ఇంటర్ విద్యాధికారి భీమ శంకరావు ఓ ప్రకటనలో తెలిపారు. బెటర్‌మెంట్, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజును చెల్లించేందుకు నేడే చివరి రోజు అని తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
VSP: సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఇవాళ నుంచి భక్తులకు ‘చందన ప్రసాదం’ పంపిణీ ప్రారంభించనున్నట్టు EO వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. చందనోత్సవం రోజు తొలగించిన చందనాన్ని ఉ. 8 గంటల నుంచి దేవస్థానం ప్రసాద కౌంటర్ల వద్ద ప్యాకెట్ ధర రూ.10కు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ATP: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం అనంతపురం జిల్లా పెద్ద కౌకుంట్ల గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటారు. గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ పర్యటన సాగనుంది. ప్రజలు తమ విన్నపాలను నేరుగా మంత్రికి వివరించవచ్చని అధికారులు తెలిపారు.
NDL: కొలిమిగుండ్ల జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నేటి నుంచి రాయలసీమ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు నాగకుళాయి, రమణ ఓ ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వరుస బహుమతులుగా రూ. 25,116, రూ. 15,116, రూ.10,116 అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
KDP: రాజంపేటలో పెట్రోల్, డీజిల్ కొరతపై సబ్ కలెక్టర్ హెచ్.యస్. భావన ఐఏఎస్ స్పందించారు. స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను తెలుసుకుని, వెంటనే పెట్రోల్ బంకులకు చేరుకుని సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కొంతకాలం ఇంధన సరఫరాలో అంతరాయం వచ్చినప్పటికీ, ఇది తాత్కాలికమేనని ఆమె తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటు కోసం అధికారులు పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. సుమారు 50 ఎకరాల స్థలం అవసరమని భావిస్తూ బైపాస్ రోడ్, శాంటోరియం సమీపం, పోతుబోలు రోడ్ ప్రాంతాలను పరిశీలించారు. రైతులు, వ్యాపారులకు అనుకూలంగా రవాణా సౌకర్యాలు ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. నివేదిక త్వరలో ప్రభుత్వానికి పంపనున్నారు అధికారులు.
వేమూరు మండలం, జంపని గ్రామంలోని శ్రీ భూ సహిత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మోహిని ఏకాదశి పర్వదినం సందర్భంగా ఇవాళ ఉదయం అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం కనిపించింది. ఉదయ సూర్యకిరణాలు మూలవిరాట్ స్వరూపమైన స్వామివారి విగ్రహాన్ని పాదాల నుంచి కిరీటం వరకు తాకాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రతి అంగం సూర్య కాంతిలో ప్రకాశించింది. ఈ దృశ్యాన్ని దర్శించిన భక్తులు భక్తి పరవశంలో మునిగిపోయారు.
VSP: మధురవాడ, మారికవలస ప్రాంతాల్లో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కొమ్మాది బంక్ వద్ద ఇవాళ భారీగా క్యూలు కనిపించాయి. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరఫరా లోపం కారణమని సిబ్బంది చెబుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
WG: ‘మే’ డేను వాడవాడలా కార్మికులు ఘనంగా నిర్వహించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ఆదివారం తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఏపీ మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో భీమారావు మాట్లాడారు. ‘మే’ డే ఉద్యమ పోరాట స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాల పునరుద్ధరించాలని కోరారు.
W.G: నరసాపురం నుంచి హైదరాబాద్ (చర్లపల్లి) వరకు నడిచే నూతన వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఆదివారం ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుందని ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని మంత్రి అన్నారు.
NDL: ప్యాపిలి మండలం పోతుదొడ్డిలో కోడి పందేల నిర్వాహకులను ఆదివారం సాయంత్రం ఎస్సై నాగార్జున అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన రవికుమార్, మునుగుల రామాంజనేయులు, నాగప్ప, రామకృష్ణ తదితరులు గ్రామ శివారు ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తుండటంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 8 బైక్లు, 4 కోడి కత్తులు, 3 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామున్నారు.
ATP: గుత్తి పోర్టు రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు విచారణ చేపట్టారు.