NLR: కొండాపురం మండల కేంద్రంలో ఉన్న లైబ్రరీ రెండేళ్ల నుంచి మూసివేశారు. దీని వలన విశ్రాంత ఉద్యోగులకు, పోటీ పరీక్షలకు చదువుకునే విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుందని సోమవారం బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేస్తూ.. గతంలో ఎంతో ఉపయోగంగా ఉండే లైబ్రరీని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రెసిడెంట్ కరుటూరి శ్రీరామమూర్తి, పంచాయతీ ప్రత్యేక అధికారితో కలిసి సోమవారం ప్రారంభించారు. రైతులు తమ పంటను సరైన ధరకు విక్రయించేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం పారదర్శకంగా కొనుగోలు జరుగుతాయని హామీ ఇచ్చారు.
ATP: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంత్రి నారా లోకేశ్‌తో కలిసి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి కలిశారు. రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు చట్టరూపం దాల్చడంతో మంత్రి లోకేశ్‌తో కలిసి ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి వారు వివరించారు.
సత్యసాయి: మహిళలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ను మంత్రి సత్యకుమార్ యాదవ్ బత్తలపల్లిలో వర్చువల్‌గా వీక్షించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. కుటుంబాన్ని నడిపించే మహిళ సమాజాన్ని కూడా ప్రగతి పథంలో నడిపించగలదని తెలిపారు.
NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 41వ డివిజన్ శివగిరి కాలనీ, పరమేశ్వరి నగర్ ప్రాంతాలలో సోమవారం పర్యటించారు. డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైను కాలువల నిర్మాణ పనుల నాణ్యతను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
NDL: నంద్యాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను సోమవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్‌తో పాటు సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు.
GNTR: కేంద్ర ఉక్కు గనుల శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరును వేగవంతం చేయాలని, ప్రక్రియను మరింత సరళీకరించడంపై చర్చించారు. వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
SKLM: మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్మమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. సోమవారం మందస మండలం పిడి మందస గ్రామంలో NREGS ద్వారా మంజూరైన సీసీ రోడ్డును ప్రారంభించారు. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడం జరుగుతుందని కొనియాడారు. అభివృద్ధి,సంక్షేమానికి సమ ప్రాధాన్యతను కల్పిస్తూ సీఎం చంద్రబాబు ఏపీలో పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.
ఏలూరు ఎస్పీ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్వీకరించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయన్నారు. ఈ పీజీఆర్ఎస్‌లో 46 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు.
CTR: ఐసీడీఎస్ కార్వేటినగరం ప్రాజెక్టు సీడీపీవో శోభారాణి ఆధ్వర్యంలో వెదురుకుప్పం అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోషకాహార లోపం నివారణ, చిన్నపిల్లల పోషణ పద్ధతులు, సెల్‌ఫోన్ వినియోగం తగ్గింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విన్నింగ్ ఫుడ్‌పై పోటీలు నిర్వహించి, తల్లులకు సరైన పోషకాహారంపై మార్గనిర్దేశం చేశారు.
కృష్ణా: కోడూరు అవుట్ పాల్స్ స్లూయిస్ మరమ్మతు పనులను మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవుట్ పాల్స్ గేట్లు పాడైన కారణంగా, సుమారు 1500 ఎకరాలలో ఉప్పు నీరు చేరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అధికారులు జాప్యం చేయడంతో రైతులే స్వచ్ఛందంగా మరమ్మతు పనులు చేపట్టారని చెప్పుకొచ్చారు.
NTR: పెండింగ్‌లో ఉన్న తమ జీతాలు ఇవ్వాలని తిరువూరు ఆసుపత్రి సిబ్బంది అమరావతి ఆసుపత్రి ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యం జీతాలు ఇవ్వటంలేదని లేబర్ అధికారికి పిర్యాదు చేస్తే, మీరు ఆసుపత్రికి వెళ్ళి యాజమాన్యంను అడగమని అధికారి చెప్పారని సిబ్బంది తెలిపారు.
ప్రకాశం: ముఠా కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాయల మాలకొండయ్య డిమాండ్ చేశారు. సోమవారం వెలిగండ్లలో ముఠా కార్మికులతో సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ నెల 17,18,19 తేదీలలో నంద్యాలలో జరగనున్న రాష్ట్ర సీఐటీయూ 17వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
AKP: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు నడవాలని ఎస్ రాయవరం మండలం కొరుప్రోలు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం కే ప్రసాద్ సూచించారు. సోమవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి చేశారన్నారు.
VSP: సూర్యబాగ్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వారోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రంధాలయ ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ సేవలను కొనియాడారు. సమానత్వం, మౌలిక హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. విద్యతో ముందుకు వెళ్లాలని పాఠకులకు పిలుపునిచ్చారు.