W.G: ఆచంట మండలం కొడమంచిలిలో 6 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వెంకటస్వామికి సంబంధించిన షాపును పోలీసులు గురువారం జేసీబీతో కూల్చివేశారు. సోమవారం షాపు వద్దకు వెళ్లిన బాలికకు షాపు యజమాని వెంకటస్వామి మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆచంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
AKP: వైసీపీ 2.0లో యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన సిద్ధార్థ రెడ్డితో పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు పి నరేష్ గురువారం భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో పార్టీలో యువతకు కీలక బాధ్యతలు అప్పగిస్తామన్నారు.
KRNL: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారిని గురువారం ఎమ్మెల్యే పీవీ పార్థసారథి దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు శేష వస్త్రం, ప్రసాదాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. స్వామి కృపతో నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్ధించారు.
ప్రకాశం: కొండపి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం కేసుల పురోగతిపై సీఐ సోమశేఖర్ సమీక్ష నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, సిబ్బందితో సమావేశం జరిగింది. వివిధ కేసుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ప్రత్యేకంగా కేసు డైరీ ఫైల్స్‌ను ఆయన పరిశీలిస్తూ దర్యాప్తు విధానం, సాక్షాలు సేకరణ, కేసులు త్వరగా పరిష్కారం అంశాలపై సూచనలు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
KRNL: సీఎం చంద్రబాబుకు సినిమా చూపే సీన్ జగన్‌కు లేదని గురువారం మంత్రి సవిత అన్నారు. ‘పాదయాత్ర కాకపోతే పొర్లుదండాలు పెట్టుకో. అమరావతి విషయంలో మూడు ముక్కలాట ఆడారు. అమరావతి మహిళలను ఇబ్బంది పెట్టారు. ఫిర్యాదులు చేయడం, పెట్టుబడులను అడ్డుకోవడం కొత్తేమీ కాదు’ అని ఈ మేరకు మంత్రి వ్యాఖ్యానించారు.
ATP: జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మొత్తం 98 కేసులు నమోదు చేసి, 97 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వాహనాలు నడిపిన మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
W.G: జిల్లాలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ఉచిత మెడికల్ హెల్త్ చెకప్ నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ళ, ఆకివీడు, పాలకోడేరు జర్నలిస్టులకు శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో భీమవరం లయన్స్ క్లబ్, ఫెమినా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతాయన్నారు.
సత్యసాయి: 20 సూత్రాల చైర్మన్ లంక దినకర్ శుక్రవారం మధ్యాహ్నం పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించి పథకాల అమలు, అభివృద్ధిపై చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
KKD: సామర్లకోట పట్టణంలో ఏప్రిల్ 10న తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య ఓ ప్రకటనలో తెలిపారు. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఒకరోజు ముందే నీటిని నిల్వ చేసుకోవాలని, ప్రస్తుత పరిస్థితిని గమనించి సహకరించాలని కోరారు.
KRNL: ఎమ్మిగనూరు(M) ఏనుగుబాల గ్రామానికి చెందిన వలస కూలీ పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఘటన పల్నాడు(D) సత్తెనపల్లి(M) కట్టవారిపాలెంలో గురువారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పారే సురేశ్ (21) మిరపకాయలు తెంపే పనికి వెళ్లాడు. ఆకస్మికంగా కురిసిన ఉరుములు మెరుపుల వర్షంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు జగన్ తీవ్రంగా గాయపడ్డాడు.
PLD: వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు, పీఎం సూర్యఘర్ పథకం అమలు, వేసవి కాలంలో విద్యుత్ అంతరాయాల నివారణ వంటి కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
KDP: పని భారం తగ్గించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పులివెందుల ఆర్పీలు గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మెప్మా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన వారు, నిరంతరం కొత్త నిబంధనలతో అధికారులు వేధిస్తున్నారని, పని ఒత్తిడి వల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ASR: నిత్యావసర సరుకులు, గ్యాస్ పంపిణీలో పారదర్శకమైన సేవలు అందించాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన గురువారం జీ.ఎల్.పురం మండలంలోని ఎంఎల్ఎస్ పాయింట్, గ్యాస్ గోదాంలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
NLR: తోటపల్లి గూడూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహిస్తున్నట్లు MPDO వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొంటారన్నారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం రూపంలో విన్నవించవచ్చని పేర్కొన్నారు.
CTR: చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్లో పోషణ్ పక్వాడ అవగాహన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. అంగన్వాడి ప్రీ స్కూల్ కిట్‌ను పరిశీలించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి పోషకాహారం ఎంతో కీలకమని తెలిపారు.