KRNL: తుంగభద్ర డ్యామ్ నుంచి ఎల్లెల్సీకు నీటి విడుదల నేపథ్యంలో ఆదోని మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ బసాపురం కాలువను ఇవాళ పరిశీలించారు. వేసవిలో తాగునీటి కొరత లేకుండా ఎస్ఎస్ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసి ప్రజలకు సరఫరా చేస్తామని తెలిపారు. నీటి నిల్వపై ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ, డీఈలు పాల్గొన్నారు.
KDP: రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటి నిర్వహణకు 2730 పోస్టులను మంజూరు చేశారు. ప్రొద్దుటూరుకు అదనంగా మరో 2 కోర్టులు మంజూరయ్యాయి. VIIIవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, 1వ అదనపు సివిల్ జడ్జి కోర్టు మంజూరు చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే కోర్టులకు సిబ్బందిని, ఫర్నిచరు, లైబ్రరీని మంజూరు చేశారు.
TPT: ప్రముఖ పుణ్య క్షేత్రమైన బోయకొండలో గంగమ్మను మంగళవారం అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కట్టారు. కోర్కెలు ఫలించిన భక్తులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు.
ASR: కొయ్యూరు మండలం మర్రిపాలెం అటవీ రేంజ్ అధికారిగా వెంకటరాజు ఇవాళ నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. మర్రిపాకలు రేంజ్ అధికారి సింహాచలం చోడవరం బదిలీ అయ్యారు. ఈమేరకు, చింతపల్లి రేంజ్ పరిధిలో డిప్యూటీ రేంజ్ అధికారిగా పనిచేస్తున్న వెంకటరాజు మర్రిపాకలు ఇన్‌ఛార్జ్ రేంజ్ అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
ATP: గుత్తి పట్టణ శివారులోని సత్యసాయి తాగునీటి పైప్ లైన్ లీకేజ్‌కు మున్సిపాలిటీ సిబ్బంది మంగళవారం మరమ్మతు పనులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మీయ మాట్లాడుతూ.. తాగునీటి పైప్ లైన్ లీకేజ్ కారణంగా గుత్తి పట్టణానికి రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. మరమ్మతుల అనంతరం తాగునీటి సరఫరా యథావిధిగా జరుగుతుందన్నారు.
VZM: బొబ్బిలి మున్సిపల్ రెవిన్యూ అధికారిగా ఎల్.ఉమామహేశ్వరరావు నియామకమయ్యారు. యలమంచిలి మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆయనకు ప్రమోషన్ రావడంతో ఆర్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. పన్నులను సకాలంలో వసూలు చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
SKLM: మెళియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన వినోద్ (40) మహేంద్రగిరి పర్వతంపై పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మృతునికి భార్య సంతోషి, ఇద్దరూ పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
VSP: దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు ఇవాళ పోలమాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అంతరాలయంలో చీర, సారె, పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో రాజ్ గోపాల్ రెడ్డి ప్రసాదం అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో కోరికలు నెరవేరుతాయని ఎమ్మెల్యే తెలిపారు.
KRNL: హొళగుంద మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సాయిబన్న దర్గా వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించి, సుమారు 23 మంది రాజకీయ నాయకులు, విలేకరులు, మహిళల ఫోటోలను భూమిలో పాతిపెట్టినట్లు బాధితులు ఇవాళ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై దిలీప్ కుమార్ స్పందించి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కృష్ణా: తమిళనాడు, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆయా రాష్ట్రాల వలస కార్మికులకు ఏపీ ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఈ నెల 9న పుదుచ్చేరి, 23న తమిళనాడులో పోలింగ్ జరగనున్నందున కార్మికులు ఓటు వేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయవాడ లేబర్ డిప్యూటీ కమిషనర్ ధనలక్ష్మి తెలిపారు. అన్ని సంస్థలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
నెల్లూరులోని మిక్లిమ్స్ క్లబ్‌లో జిల్లాస్థాయి క్యారం బోర్డ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మొదటి స్థానం బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి చెందిన కోఆప్షన్ నెంబర్ అల్లా బక్షు గెలిచారు. దీంతో నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించి కప్‌ను అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలవాలని వారు ఆకాంక్షించారు. యువత క్రీడలపై ముక్కువ చూపాలన్నారు.
W.G: ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఇళ్ల స్థలాల పేరట తమని పలువురు మోసం చేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ సీపీఎం పార్టీ గ్రామ సెక్రెటరీ ఇల్లింద్రపత్తి సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని స్థలాలు ఇవ్వకుండా వారిని మోసం చేయడం అనేది దారుణమన్నారు. అధికారులు స్పందించి తక్షణమే బాధితులకు న్యాయం చేసి మోసగాళ్ళపై చర్యలు తీసుకోవాలన్నారు.
TPT: వేసవి సెలవులు మొదలు కావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుపతిలో జారీ చేస్తున్న దర్శన టోకెన్లు గంటల వ్యవధిలో అయిపోతున్నాయి. ఫ్రీ దర్శనం కోసం వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు టోకెన్ల కోసం మరుసటి రోజు కోసం ఆగాల్సివస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాడ్జీల ధరలు ఎక్కువ కావడంతో చెట్ల కిందే నిద్రిస్తున్నారు.
ATP: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంపై అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. రాజధాని కల సాకారం చేసినందుకు రాష్ట్రపతి ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రైతుల సుదీర్ఘ త్యాగం, సహనం ఫలించిన చారిత్రాత్మక సందర్భమిదని ఆయన పేర్కొన్నారు.
VZM: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీడీవో కిరణ్ కుమార్ అన్నారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి వేసవిలో తాగునీటికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. మంచినీటి పథకాల మోటార్లు మరమ్మతులకు గురైతే 24 గంటల్లో బాగు చేయాలని వారికి ఆదేశించారు.