TPT: రెండేళ్లలో రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం తిరుపతి రామాపురం డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం చెత్త నిర్వహణలో విఫలమైందని మంత్రి విమర్శించారు. 123 మున్సిపాలిటీలను చెత్తమయం చేశారని ఆరోపించారు. 2024 తర్వాత చెత్త తొలగింపుపై సీఎం చంద్రబాబు దృష్టిపెట్టారని తెలిపారు.
కడపలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన హత్య ఘటనపై జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన వివరాలు తెలుసుకుని, దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశించారు. శాస్త్రీయ సాక్ష్యాలతో కేసును బలపరచి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
VZM: ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి ఆకస్మిక వాహన తనిఖీలు సోమవారం చేపట్టారు. ఈ తనిఖీల్లో మైనర్లు వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకొని వాహనాలను స్టేషనుకు తరలించారు. తల్లిదండ్రులను స్టేషనుకు పిలిపించి లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని సూచించారు.
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సోమవారం జూపాడు బంగ్లా మండలం తత్తూరు గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
KKD: గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” అనే అంశంపై 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. రాబోయే 100 రోజుల్లో నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగం, రైతులకు నిరంతర సాగునీటి సరఫరా అందుబాటుపై దృష్టి పెట్టాలని ఎంపీ స్పష్టం చేశారు
కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామానికి చెందిన కుదురు శ్రావణ్ కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు, ఒక చేయి విరిగి ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని కష్టం తెలుసుకున్న మంత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన తల్లి జ్యోతికి మంత్రి సుభాష్ పదివేల రూపాయల చెక్కును సోమవారం ఆర్థిక సాయం అందించారు.
విశాఖపట్నంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతతో పాటు గడువులోగా పూర్తి చేయాలని, పదేపదే వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 334 వినతులు నమోదయ్యాయని చెప్పారు.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పీకల వాగు కాలువ పూడిక తీత పనులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి సోమవారం పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత’ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ పనులు కొనసాగుతున్నాయి.
PLD: నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిభావం వల్ల గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని, బ్రహ్మంగారి బోధనలు అందరికీ ఆదర్శప్రాయమని జీవితంలో పేర్కొన్నారు.
NTR: నందిగామ పట్టణంలో వేసవి కాలం దృష్ట్యా ప్రతిరోజు తాగునీరు అందించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు అర్జీ సమర్పించారు. 20 వార్డుల్లో పది రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయు కార్యదర్శి కె. గోపాల్ తెలిపారు. అనాసాగరం గ్రామంలోని కొత్త వాటర్ ట్యాంక్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
VZM: 2024లో ఎస్.కోట పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో నాసిక్‌కు చెందిన తమన్నా జావేద్ నిందితుడు. ఈ కేసులో ఎస్.కోటకి చెందిన ఎస్.సాంబశివరావు, నిందితుడికి బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. అయితే, దరఖాస్తును పరిశీలించిన కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలింది. కోర్టు సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు.
కృష్ణా: నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ సింగలా రాధాకృష్ణ ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, పంచాయతీ కార్యాలయంలో సత్కార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. పంచాయతీ సెక్రటరీ ‘స్వర్ణ గ్రామ పంచాయితీ సిబ్బంది కలిసి సర్పంచ్ రాధాకృష్ణను శాలువతో సత్కరించారు. గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
BPT: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సజ్జాపురానికి చెందిన తేలప్రోలు నాగేశ్వరరావు (62) తన టీవీఎస్ ఎక్సెల్‌పై రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రాలీ ఆటో ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి.
W.G: మార్టేరు వరి పరిశోధనా కేంద్రంలో ఈనెల 8న భారీ ‘కిసాన్ మేళా’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి(ఏవో) డాక్టరు జ్యోషిలా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని రైతులందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆమె కోరారు. సాగు పద్ధతులపై అవగాహనతో పాటు, శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు నేరుగా అందిస్తారని పేర్కొన్నారు.
SKLM: కాశీబుగ్గ పోస్టాఫీస్‌లో పౌర సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంబాల మార్పిడి పనుల కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఖాతాదారులు, పెన్షన్ దారులు అనేక అవస్థలు పడుతున్నారు. పోస్టల్ ఉన్నతాధికారులు స్పందించి కొత్త యూపీఎస్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.