నెల్లూరు రూరల్ 36వ డివిజన్ బట్వాడిపాలెం సెంటర్లో రూ. 50 లక్షలతో నిర్మించిన వాటర్ ఫౌంటెన్ను మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వై.ఓ. నందన్, TDP గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: మంత్రి సవిత మంగళవారం పెనుకొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం చాలకూరు చెరువు వద్ద ‘మన ఊరు మన నీరు’ కార్యక్రమంలో పాల్గొని జలహారతి పూజ చేస్తారు. అనంతరం సోమందేపల్లి ఎస్సీ కాలనీలో ఉచిత సోలార్ పథకాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిపల్లి రంగనాథ స్వామి ఆలయ పూజలు, చోలెమర్రి గ్రామ జాతరలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.
KRNL: ఆలూరు గెస్ట్ హౌస్లో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడు మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి అయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనిన్నారు. పనుల్లో ఆలస్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాల పెంపుతో కరువు నివారణకు పనులను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ATP: అనంతపురంలో ఓ ప్రముఖ దినపత్రిక విలేకరి రవికుమార్ మరణం పట్ల ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి రవికుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా వారికి తనవంతు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ప్రభుత్వం నుంచి ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
AKP: కోటవురట్ల మండలానికి 8 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. తను నాలుగు పంచాయతీలకు, తహసీల్దార్ తిరుమల బాబు 3 పంచాయతీలకు నియమితులైనట్లు తెలిపారు. RWS ఏఈ శ్రీనివాస్, మండల పరిషత్ ఏఓ నాగేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దారు రమేష్, డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావుకు ఏవో సరోజిని నియమితులయ్యారన్నారు.
కృష్ణా: మోపిదేవి మండలం పెదప్రోలు GPలో వీధి దీపాల ఏర్పాటులో తీవ్ర లోపాలు వెలుగుచూస్తున్నాయి. జనసంచారం లేని పొలాల్లో లైట్లు ఏర్పాటు చేసి, పగలు కూడా ఆఫ్ చేయకపోవడం, అవసరమైన ప్రాంతాల్లో మాత్రం లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఒకే స్తంభానికి రెండు లైట్లు అమర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. PGRSలో ఫిర్యాదులు చేసినా స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ASR: అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో 90 కేజీల గంజాయి పట్టుబడిందని ఎస్సై శంకరరావు సోమవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా, అరకు వైపు నుంచి వస్తున్న కారులో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
E.G: గోపాలపురం బెతెల్ చర్చి సంఘకాపరి, అంతర్జాతీయ పాస్టర్ రెవ. తిగిరిపల్లి రాజ్ పాల్ అరుదైన గౌరవం అందుకున్నారు. ఆధ్యాత్మిక సేవలోకి అడుగుపెట్టిన ఎనిమిది నెలల వ్యవధిలోనే ఆయన సేవలను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో ‘బిషప్’ అవార్డు ప్రదానం చేశారు. సోమవారం చర్చిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనను గజమాలతో ఘనంగా సన్మానించారు.
W.G: నరసాపురం మండల పరిధిలో రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏడాది మొత్తం 14 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏవో జ్యోషిలా తెలిపారు. గతంలో ఉన్న కేంద్రాలతో పాటు, కొత్తగా వై.ఎస్.పాలెం, లిఖితపూడి, కే.బేతపూడి గ్రామాల్లో కూడా కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వారు తెలిపారు.
NLR: మహిళల రక్షణ కవచం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్ ఆవశ్యకత గురించి ఉదయగిరి పోలీసులు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్ ప్రతి మహిళ తప్పక డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇది మహిళల రక్షణ కవచం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
KDP: కమలాపురం పరిధి దాదిరెడ్డిపల్లిలో వేరుశనగ పంటలను ADA నరసింహారెడ్డి సోమవారం పరిశీలించారు. పంటకు పొగాకు లద్దె పురుగు, ఆకు ముడత ఆశిస్తున్నట్లు గుర్తించారు. నివారణకు పారాజైడ్ లేదా వయగోతో పాటు 13-0-45 ఎరువును కలిపి పిచికారీ చేయాలన్నారు. మువ్వకుళ్లు తెగులుకు దోమల మందు వాడాలన్నారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని, APAIMS యాప్ సేవలు వినియోగించుకోవాలన్నారు.
CTR: చిత్తూరు మండలం తిమ్మసముద్రంలో 2021లో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో వ్యక్తిపై హత్యాయత్నం కేసులో 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3000 జరిమానా విధించారు. 8వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి సుంకర శ్రీదేవి ఈ మేరకు నిన్న తీర్పు వెలువరించారు.
TPT: పుత్తూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు ప్రతి మంగళవారం కూరగాయల వారాంతపు సంత జరుగుతుందని మార్కెట్ యార్డ్ కమిటీ తెలిపింది. మార్కెట్ యార్డ్లో విశాల ప్రదేశం అనుకూలంగా ఉందని చెప్పారు. మండల పరిధిలోని రైతులు, వ్యాపారులు కూరగాయలు తీసుకువచ్చి క్రయ విక్రయాలు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KRNL: మండలంలో డీజే నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై డి.రమేష్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కోసిగి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో డీజే నిర్వాహకులకు శబ్ద కాలుష్యంపై అవగాహన కల్పించారు. డీజే వినియోగానికి ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
PPM: వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో ప్రస్తుతం అన్ని రకాల సాధారణ, అత్యవసర మందులు తగినంత స్థాయిలో అందుబాటులో ఉన్నాయని DMHO డా.భాస్కరరావు సోమవారం తెలిపారు. అరకొర సౌకర్యాలు, రోగులు ఇక్కట్లు అనే కథనానికి ఆయన పై విధంగా స్పందించారు. ఇతర ప్రాంతాల నుంచి రోగులు అధిక సంఖ్యలో వచ్చిన మందులను సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు.