సత్యసాయి: సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలో 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానళ్లను మంత్రి సవిత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా విద్యుత్ ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
TPT: తిరుపతి సందేశ్ 2.0 కార్యక్రమంలో జూమ్ మీటింగ్ సందర్భంగా “YS Jagan Mohan” పేరుతో కనిపించిన లాగిన్ అధికారికం కాదని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ఐజీపీ ఆకే.రవికృష్ణ అధికారిక జూమ్ ఐడీ వేరుగా ఉందని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.
NDL: లోకక్షేమం కోసం శ్రీశైలం భ్రమరాంబ దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పసుపు, కుంకుమ సమర్పణను ‘శాంతి ప్రక్రియగా పిలుస్తారని ఈవో శ్రీనివాసరావు ఇవాళ తెలిపారు. తొలి విడతలో 20 వేల గుమ్మడికాయలు, 5 వేల కొబ్బరికాయలు, లక్షకు పైగా నిమ్మకాయలను సమర్పించినట్లు ఈవో వెల్లడించారు.
ELR: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ వైద్యాధికారి లక్ష్మీనారాయణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలని, పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంమైన వీరబ్రహ్మేంద్ర స్వామిని మంగళవారం జబర్దస్త్ కామెడీ షో యాక్టర్లు సద్దాం, నవ సందీప్, తదితరులు దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి వెంకటాద్రి స్వామిని దర్శించుకుని సన్మానించారు.
విశాఖ నగరంలోని అల్లిపురం ఏడుగుళ్ళు సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఈ సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు.
AKP: ప్రభుత్వం జీవో 91 సవరించి జీవో 60 విడుదల చేసి పే స్కేల్ తగ్గించడంపై పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం గొలుగొండ ఎంపీడీవో శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. జీవో 91 ప్రకారం ప్లే స్కేల్ రూ.28,280 అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ జీవోను సవరణ చేసి జీవో 60 వల్ల రూ. 25,220 తగ్గించిందన్నారు.
VZM: జేసీ ఎస్. సేధు మాధవన్ మంగళవారం స్వామి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఏజెన్సీ మూతపడటంతో గ్యాస్ సరఫరా నిలిచిపోయి వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా గ్యాస్ సిలిండర్లను నిరంతరం సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
ASR: చింతపల్లి పాత బస్టాండ్ వద్ద ప్రజా మరుగుదొడ్ల సమస్యకు పరిష్కారం లభించింది. నీటి సరఫరా లేక, నిర్వహణ లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని స్థానికులు ఎంపీడీవో సీతామహాలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె ప్రత్యేక చొరవతో మరమ్మతులు చేపట్టించారు. పాడైన మోటార్ స్థానంలో కొత్తదాన్ని అమర్చడంతో పాటు, విద్యుత్ సరఫరా కోసం ప్యానెల్ బోర్డు ఏర్పాటు చేశారు.
అన్నమయ్య: మదనపల్లె చీగలబైలు పంచాయతీలోని వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ పనులను ఎమ్మెల్యే షాజహాన్, ఏఎంసీ ఛైర్మన్ జంగాల శివరామ్ మంగళవారం ప్రారంభించారు. భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత ద్వారా రైతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్వహించిన రైతు సమావేశంలో నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు.
ELR: జీలుగుమిల్లి మండలం తాటి రామన్నగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన విధానం మరియు ఉపాధ్యాయుల పర్యవేక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
PPM: ప్రజలకు సత్వర సేవలు అందించడమే సచివాలయం ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. అటువంటి సత్వర సేవలు అందించడంలో జాప్యం వహించరాదని తేల్చిచెప్పారు. మంగళవారం సాలూరు పట్టణంలోని సచివాలయాన్ని జేసీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
KRNL: మన ఊరిలో ఉండే ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని యుటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ భూపాల్, జిల్లా ఉపాధ్యక్షులు శంకరయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యుటీఎఫ్ తలపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిద్దాం, ఊరిని కాపాడుకుందాం తెలిపారు. కాగా, పెద్దకడబూరు బస్టాండ్‌లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
NTR: తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ స్థాయి సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పాఠశాలల్లో నమోదు పెంచాలని, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఎండల నేపథ్యంలో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో తెలిపారు.
ప్రకాశం: వేసవి సెలవుల్లో పిల్లలు సరదా కోసం కుంటలు, చెరువులు, కాలువలు, బావుల వద్ద ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సూచించారు. నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పిల్లలపై నిఘా ఉంచాలని, ఈత రాకపోతే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రమాదకర జలాశయాల్లోకి వెళ్లవద్దని సూచించారు.