కృష్ణా: జిల్లా గన్నవరం మండలం అల్లాపురంలో పాత కక్షలు ఘర్షణకు దారితీశాయి. గంజాయి, మద్యం మత్తులో ఉన్న యువకులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో హేమకుమార్ అనే యువకుడిపై జయంత్ కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ.. హేమకుమార్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
WG: ఉండి గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ శ్రీనివాస్(50) గుంటూరు జీజీహెచ్ భవనం పై నుంచి దూకి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈనెల 23న చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. కాలకృత్యాలకని వెళ్లి వార్డు కిటికీలోంచి కిందకు దూకేశారు. అవుట్ పోస్ట్ పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు.
KDP: పులివెందుల శిల్పారామంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పరిపాలన అధికారి విశ్వనాథ రెడ్డి తెలిపారు. మాస్టర్ కిషోర్ ఆధ్వర్యంలోని యువ రాజా డాన్సింగ్ స్కూల్‌కు చెందిన చిన్నారులు శాస్త్రీయ, జానపద నృత్యాలను ప్రదర్శించనున్నారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు ఆదివారం అయినవిల్లి మండలం చింతనలంక వాస్తవ్యులు విల్లా మణికంఠ, జ్యోతి వారి కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం అందజేశారు.
NTR: ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా వీరులపాడులో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా- ఖమ్మం జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. పోటీల్లో ఖమ్మం సాగర్ జట్టు ప్రథమ స్థానం సాధించి రూ. 20,116 నగదు బహుమతి అందుకుంది. విజయవాడ స్వామి జట్టు ద్వితీయ స్థానం సాధించి రూ.10,116, వీరులపాడు గణేష్ జట్టు తృతీయ స్థానం సాధించి రూ. 7,116 బహుమతులు పొందాయి.
SKLM: పలాసలోని ఉదయపురం ప్రాంతంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల దోమలు, అంటువ్యాధులు పెరిగే అవకాశముందని అధికారులు వివరించారు.
TPT: చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీలో శ్రీ గౌరీ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయంలో (పురాతన శివాలయం )శనివారం జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గుడి ఆవరణ నందు భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించరు.
అనకాపల్లి జిల్లా కొత్త రిజిస్ట్రార్‌గా పి. రత్నకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. విశాఖ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆడిట్ విభాగంలో పనిచేస్తున్న ఆయన పదోన్నతపై అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్‌గా బదిలీ అయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన మన్మధరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
విజయనగరం: కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం గ్రామం రెల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 21/11,13,15 విస్తీర్ణం 1.50 సెంట్లు భూమిలో మండల తహసీల్దార్ రమాలక్ష్మి ఆదేశాల మేరకు స్థానిక వీఆర్వో సుధీర్, సర్వేయర్ చంద్రశేఖర్‌తో కలిసి ప్రభుత్వ హెచ్చరిక బోర్డును పెట్టారు. మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని ఆమె తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ELR: కుక్కునూరు మండలంలో వివాహితను వేధించిన ఘటనలో కానిస్టేబుల్‌పై వేటు పడింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు అరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.
SKLM: జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ ధరలు గతంతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. స్కిన్‌తో కూడిన చికెన్ కేజీ రూ.210, స్కిన్ లెస్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. నాటుకోడి ధర రూ.700 ఉండగా, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని వ్యాపారులు తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లి మండలంలో, సిద్ధమ్మగారిపల్లెలోని రాముల గుడిలో శనివారం విద్యుత్ దీపాల అలంకరణ పనులు చేస్తున్న అరుణ్ (20) అనే యువకుడు కాలుజారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకుల కథనం ప్రకారం, బసినికొండకు చెందిన అరుణ్, పూజల నేపథ్యంలో గుడి పైకి ఎక్కి లైట్లు అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.
KDP: బద్వేల్ పట్టణం,చుట్టుపక్కల గ్రామాలలో గేదెలు, ఎద్దులు, దున్నపోతులు తదితర పశువుల యజమానులకు CI రామకృష్ణ కీలస సూచన చేశారు. పశువుల మెడకు,కొమ్ములకు రేడియం స్టిక్కర్లు, రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి వేళల్లో జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై సంచరించే పశువులు వాహనదారులకు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
VZM: కోనసీమ తిరుపతిగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కీర్తి ఆర్ట్స్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు ఘనంగా జరిగాయి. విజయనగరం అమృత శ్రీ వర్షిణి నృత్య పాఠశాల విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనతో ‘గోవిందామృత’ అవార్డులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా గురువు సౌమ్య తెలికిచెర్లను నిర్వాహకులు ‘అన్నమయ్య’ అవార్డుతో ఘనంగా సత్కరించి అభినందించారు.
NTR: అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఈవో వి.కె. శీనానాయక్ దంపతులు ప్రత్యేక పూజల అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణలు, భజనలు, కోలాట నృత్యాలతో సాగిన ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మార్గమంతా భక్తులకు కుంకుమ, ప్రసాదాలను అందజేశారు.