ఏలూరు అగ్రహారానికి చెందిన వెంకట సాయి దీపక్ ట్రేడింగ్‌లో లాభాల పేరట మోసపోయానంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. ఎస్సై రామకృష్ణ వివరాల మేరకు.. హైదరాబాదులోని ఓ కంపెనీలో తన తోటి ఉద్యోగిగా పనిచేస్తున్న సాయి ప్రవీణ్‌కు గత ఏడాది పలు దఫాలుగా రూ. 6.64 లక్షల సొమ్మును వెంకట సాయి ఇచ్చాడన్నారు. 6 నెలలు గడుస్తున్నా లాభాలు ఇవ్వలేదని తెలిపారు.
TPT: పిచ్చాటూరు ఎంపీడీవో కార్యాలయంలో జూన్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తహసీల్దార్ చంద్రబాబు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ వేదికలో మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొంటారని తెలిపారు. సమస్యలు ఉన్నవారు ఆయా శాఖల అధికారులకు ఫిర్యాదులు అందించి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
CTR: పుంగనూరు AMC యార్డులో ఆదివారం తీవ్ర ఉధృతి నెలకొంది. శనివారం రాత్రి వాహనాలు అడ్డు ఉన్నాయని లారీ డ్రైవర్ రామసముద్రం మండలానికి చెందిన టమోటా రైతు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో లారీ డ్రైవర్ రైతును గాయపరిచాడు. విషయం తెలుసుకున్న రైతులు మార్కెట్ యార్డ్ వద్ద నిరసన తెలిపారు. ఛైర్మన్ సమితి యాదవ్, సీఐ సుబ్బరాయుడు జోక్యంతో నిరసన విరమింప చేశారు.
NTR: కంచికచర్ల శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పుస్తక పఠనం నిర్వహించి, కథలు చదివించి చెప్పించారు. డాన్స్ మాస్టర్ చైతన్య నృత్య కళల్లో శిక్షణ ఇవ్వగా విద్యార్థులు ఆసక్తిగా సాధన చేశారు. కంప్యూటర్ ద్వారా నీతికథలు విన్నారు. క్యారం బోర్డు, చెస్, లూడో వంటి ఆటలు ఆడించారు.
అన్నమయ్య: మదనపల్లె మండలంలోని మాలేపాడులో ఆదివారం టీడీపీకి చెందిన మధుకర్ రెడ్డి, జాఫర్ బాష వర్గాల మధ్య దారి, భూ వివాదాల కారణంగా ఘర్షణ చోటుచేసుకుంది. గతంలో పంటల విషయంలో అడ్డుపడటం, ప్రస్తుతం రహదారిని మూసివేయడం వంటి కారణాలతో ఇరువర్గాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
KRNL: ఆదోని పట్టణంలోని అమరావతి నగర్‌లో భార్య చేతిలో భర్త మహేష్ మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. అనంతరం మహేష్‌ను సమీప పొలం వద్దకు తీసుకెళ్లి గొంతు పిసికి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఇవాళ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TPT: నారాయణవనం మండల పోలీస్ స్టేషన్‌లో ASIగా పని చేస్తున్న శ్రీనివాసులు ఆదివారం వేకువజామున రేణిగుంటలోని అమర హాస్పిటల్లో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. గాజుల మండ్యంకు చెందిన ఆయన అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారన్నారు. ఆయనకు ప్రస్తుతం SIగా పదోన్నతి లభించింది. శిక్షణ కోసం అనుమతి వస్తుందని ఎదురుచూస్తున్నారని సహచర పోలీసులు తెలిపారు.
CTR: పొగాకు వాడకంతో ఆరోగ్యానికి నష్టం చేకూరుతుందని సదుం మండలం చెరుకువారిపల్లి పీహెచ్‌సీ డాక్టర్ హేమంత్ కృష్ణ తెలిపారు. ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పొగాకు వాడకంతో క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయని వెల్లడించారు. వాటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
GNTR: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 3న పీవీఎస్ లలితా ఆస్పత్రి ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదివారం పరిశీలించారు. హెలిప్యాడ్, పర్యటన మార్గం, ఆస్పత్రిలోని ప్రారంభోత్సవ ప్రాంగణం, సభా వేదిక తదితర ప్రాంతాలను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ELR: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. పలు క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం మజ్జిగను , చిన్నపిల్లల కోసం పాలు దేవస్థానం అధికారులు పంపిణీ చేశారు. ఆదివారం అధిక సంఖ్యలో భక్తుల రావడంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
అనకాపల్లి: అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పలువురు ఆలయ ఆవరణలో వంటలు వండి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ నాగశ్రీను పాల్గొన్నారు.
WG: నరసాపురం ప్రధాన కాలువలోకి ఆదివారం నీటిపారుదలశాఖ అధికారులు నీరు విడుదల చేశారు. వేసవిలో కాలువ పనుల నిమిత్తం నిలిపివేసిన నీటిని తిరిగి వదలడంతో ఖరీఫ్ సీజన్ పంటలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని డిఈఈ సిహెచ్. వెంకటనారాయణ తెలిపారు. అలాగే ఈ నీటి విడుదలతో పాలకొల్లులో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న తాగునీటి సమస్య కూడా పూర్తిగా తీరుతుందని ఆయన పేర్కొన్నారు.
NTR: జగ్గయ్యపేటఎస్‌జీఎస్ కళాశాలను ఆదివారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల ఈదురు గాలులు, వర్షాలతో జరిగిన నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, పూర్తి అంచనా నివేదికను కలెక్టర్‌కు పంపాలని ఎంఆర్ఓను ఆదేశించారు. ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని కళాశాల యాజమాన్యానికి హామీ ఇచ్చారు.
KDP: నీళ్లు వాసన వస్తున్నాయని పులివెందుల పట్టణంలోని లక్ష్మీ హాల్ ఏరియా సరస్వతీ వీధికి చెందిన ప్రజలు ఆదివారం మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. నీళ్లు కూడా 3 రోజులకు ఒకసారి వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ తెలియజేశారు.మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
అల్లూరి: ఏజెన్సీ అడవుల్లో లభించే స్వచ్ఛమైన తేనెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొండలు, లోయలు, అటవీ ప్రాంతాల్లో గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో తేనెను సేకరిస్తున్నారు. ఔషధ గుణాలు, సహజ రుచితో ఈ తేనె వినియోగదారులను ఆకట్టుకుంటోంది. విక్రయ వేదికలు కల్పిస్తే గిరిజనులకు మరింత ఆదాయం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.