W.G: సాంకేతిక సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయని రైతు నాయకుడు కూనపరెడ్డి రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నరసాపురంలో ఆయన మాట్లాడుతూ.. ఈ- పాస్ పుస్తకాలు అందక రైతులు సచివాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. సైట్ ఓపెన్ కావడం లేదనే సాకుతో సిబ్బంది కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
ASR: డుంబ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ పాడి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు వయబారికి రౌతు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య హుటాహుటిన గ్రామానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
CTR: ఈనెల 8వ తేదీ బుధవారం పుంగనూరులో న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పీలేరులో న్యాయవాది పి.యల్లను దారుణంగా హత్య చేశారు. దీనిని ఖండిస్తూ స్థానిక న్యాయవాదులు రేపు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు తెలిపారు.
విశాఖ జిల్లాను దేశానికి ఆదర్శంగా నిలిపేలా వినూత్న అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలకు వేగంగా స్పందించాలని ఆదేశించారు.
కోనసీమ: పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన విధులకు గైర్హాజరైన 23 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు DEO పి. నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 6న సోమవారం నుంచి పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించగా.. విధులకు హాజరు కావాల్సిన 23 మంది చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్పెషల్ అసిస్టెంట్స్ విధులకు గైర్హాజరయ్యారన్నారు.
GNTR: తెనాలి ఏపీఎన్జీవో సంఘ కార్యవర్గ సమావేశంలో ఖాళీగా ఉన్న నాలుగు పదవులను కోఆప్షన్ ద్వారా భర్తీ చేశారు. అధ్యక్షుడు బిక్షాలు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుధాకర్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా, వెంకటేష్, వికాస్ చంద్రలను జాయింట్ సెక్రటరీలుగా, ఆదిల్ హుస్సేన్‌ను డీఈసీ సభ్యుడిగా ఎంపిక చేశారు. జిల్లా జాయింట్ సెక్రటరీ నరసింహారావు హాజరయ్యారు.
కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు బాపులపాడు మండలం రామన్నగూడెంకు కొత్త బస్ సర్వీస్ మంగళవారం ప్రారంభమైంది. హనుమాన్ జంక్షన్ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరిన బస్ 8.30కి రామన్నగూడెం చేరుకుని, వెంటనే తిరిగి జంక్షన్‌కు బయలుదేరుతుంది. సాయంత్రం 5 గంటలకు మరో సర్వీస్ ప్రారంభమై 5.30కి గ్రామానికి చేరుతుంది.
PLD: చిలకలూరిపేట మున్సిపాలిటీకి రూ.11 కోట్ల పన్ను ఆదాయం వచ్చిందని ఆర్వో సుబ్బారావు తెలిపారు. ఆదాయ రాబడిలో ఇది రాష్ట్రంలో 35వ స్థానంలో ఉందన్నారు. బకాయిలపై వడ్డీ రాయితీని ఏప్రిల్ ఆఖరు వరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలన్నారు. పన్నులు చెల్లించని వారిపై కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
VZM: కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో-బేటీ పడావో’ పథకంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణ అనర్థాలపై అధికారులు వివరించారు. అలాగే పోక్సో చట్టం, మానవ అక్రమ రవాణా నివారణపై చర్చించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
ATP: అనంతపురం JNTU సివిల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ వైశాలి ఘోర్పడే ‘బెస్ట్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఏప్రిల్ 10న టెక్కలిలో జరిగే ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ గురువుకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకపోవడం, అతివేగం వంటి నిబంధనల ఉల్లంఘనలపై నిఘా ఉంచారు.
CTR: పుంగనూరులోని అంబేద్కర్ ప్రగతి భవనంలో మంగళవారం నేషనల్ మజ్దూర్ యూనిట్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రచార కార్యదర్శి దయ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం భవిష్యత్తులో యూనియన్ తరపున చేపట్టే కార్యక్రమాల గురించి చర్చించారు. RTC ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తునట్లు తెలిపారు.
VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని మంగళవారం విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
కర్నూలు: జిల్లా ఉపాధి కార్యాలయం నిర్వహించిన మినీ జాబ్ మేళాలో 87 మంది నిరుద్యోగులు ఇవాళ పాల్గొన్నారు. వివిధ సంస్థల ఇంటర్వ్యూలలో 54 మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్లు జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
VZM: జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్‌ని వినియోగిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం వెల్లడించారు. ముఖ్యంగా ఈవ్ టీజింగ్, కోడిపందేలు, పేకాట, బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.