కర్నూలు ఉమ్మడి జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నేటి నుంచి జూన్ 3 వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. రైతు సోదరులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
GNTR:మహిళా సాధికారతలో ఎప్పుడూ టీడీపీదే ముందంజ అని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి అన్నారు. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని లోకేశ్ ప్రకటించడంతో శుక్రవారం శ్రీనివాసరావుపేటలోని ఆమె కార్యాలయంలో సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలే తమ బ్రాండ్ అంబాసిడర్లని, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతులను స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.
KDP: సింహాద్రిపురం(M) బిదినంచర్ల గ్రామంలో 110 ఏళ్ల తర్వాత శ్రీయేనే మీద గంగమ్మ తల్లి దేవరను నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ దేవర కార్యక్రమం నేటి నుంచి రెండు రోజులపాటు జరుగుతుంది. శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం దేవర కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
BPT: చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో సాగుతున్న కోడిపందేల స్థావరంపై పోలీసులు శుక్రవారం మెరుపు దాడి చేశారు. ఎస్సై కందుల కృష్ణ తిరుపతిరావు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడుల్లో పందేలు కాస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,250 నగదుతో పాటు రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ: మహిళా రిజర్వేషన్ల అమలు నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో మహిళలు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ.. మహిళా సాధికారతను ఆచరణలో చూపించిన పార్టీ టీడీపీ పార్టీయేనన్నారు. మహిళల భద్రత, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
PLD: నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు శుక్రవారం కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసి పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ‘కపాస్ కిసాన్ యాప్’ వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్లాట్ బుకింగ్, సాంకేతిక సమస్యలను పరిష్కరించి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
NLR: నెల్లూరులోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ శ్రీధర్ తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్ల మరమ్మత్తులు కారణంగా మూడో మైలు, డి ఎస్ నగర్, ప్రశాంతి నగర్, రాజీవ్ గాంధీ కాలనీ, కిసాన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
GNTR: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవీపీ కాలనీలో గంజాయి అమ్ముతూ, తాగుతున్న నలుగురు యువకులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.05 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దావీదు, యేసుబాబు, నందు, చరణ్ అంతా కేవీపీ కాలనీకి చెందినవారేనని, వీరిలో కొందరిపై గతంలోనే పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
PLD: దాచేపల్లి తంగెడ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న లారీని, తంగెడ నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నై వెళ్తున్న లారీ డ్రైవర్ తిరుపతి రెడ్డికి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.
TPT: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరిగిన వాహనసేవ వైభవంగా సాగగా, భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. దివ్య కాంతులతో అలరించిన చంద్రప్రభవాహనంపై స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.
KRNL: కర్నూలు కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సూపర్ సిక్స్ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెన్షన్, అన్నదాత సుఖీభవ తదితర పథకాల పురోగతిపై అధికారులను ఆమె ఆరా తీశారు. అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు సూచించారు.
ATP: యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశాల ఏపీ పీజీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 1154 మంది పరీక్ష రాయగా 1040 మంది అర్హత సాధించారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో భార్గవి రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించారు. జనరల్ విభాగంలో వడ్డే అనిల్ కుమార్, సెరికల్చర్‌లో ఎస్. హర్షవర్దిని, టి. మదీనా తస్లీం రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకులు సాధించారు.
KRNL: ఆదోని (M) పాండవగల్లు శివారులో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గణేకల్లుకు చెందిన యువకులు బైకుపై ముందు వెళ్తున్న ఆటోను క్రాస్ చేసే క్రమంలో ఢీకొట్టారు. ప్రమాదంలో మహేంద్ర అక్కడికక్కడేమృతి చెందగా, వీరేశ్, ఆటోలో ఉన్న మరో వ్యక్తి ఆదోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనపై పెద్దతుంబళం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
E.G: మెగా డీఎస్సీపై CBI విచారణ జరిపించాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దగా డీఎస్సీపై విద్యార్థి పోరులో భాగంగా YSRCP విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు చేతిలో దగా పడ్డ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామన్నారు.