ATP: అనంతపురం నగరంలోని కోవూరునగర్‌లో గల మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారపరెడ్డి ఇంట్లో అరుదైన బ్రహ్మ కమలాలు (మే పుష్పాలు) విరబూశాయి. కేవలం మే మాసంలో మాత్రమే పూసే ఈ ఆకర్షణీయమైన పుష్పాలు నారపరెడ్డి నివాసంలో వికసించడంతో స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మే పుష్పాలను చూడడానికి స్థానికులు, ప్రజలు ఎంతో ఆసక్తి చూపించారని నారపరెడ్డి ఈ సందర్భంగా ఆనందంగా తెలిపారు.
PLD: నరసరావుపేట రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో కుప్పకూలడంతో రైల్వే పోలీసులు వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున బుకింగ్ కౌంటర్ వద్ద ఫిట్స్ రావడంతో వ్యక్తి పడిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన వివరాలు తెలిసినవారు లేదా బంధువులు రైల్వే పోలీసులను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
WG: ఆకివీడు మందపాడు రోడ్డులో శనివారం 2 కేజీల 600 గ్రాముల గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కాళీ చరణ్ తెలిపారు. నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని చెప్పారు. కేసు ఛేదించిన సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హనుమంతు నాగరాజు పాల్గొన్నారు.
ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉచిత ద్విచక్ర వాహనాల పథకం కింద 10 మంది దివ్యాంగులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత ప్రయాణం, పెన్షన్ రూ. 3వేల నుంచి రూ. 6వేలకు పెంపు వంటి చర్యలపై వారు హర్షం వ్యక్తం చేశారు.
అన్నమయ్య: గాజువాకలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఆదివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మహిళలు, డ్రైవర్ కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
ELR: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లతో శనివారం సమీక్షించారు. కార్యక్రమంలో ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు.ప్రతీ జిల్లాలో రోజువారీ నిర్వహించాల్సిన యోగా కార్యక్రమాలపై ఆయన దిశ నిర్దేశం చేశారు.
KDP: కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. కడప జిల్లాకు ప్రభుత్వం 7,519 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అర్హులైన పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల నుంచి నిత్యావసర సరకులు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
ATP: తాడిపత్రి పట్టణంలో గాలివాన బీభత్సానికి పెద్ద చెట్టు మిద్దెపై పడటంతో గోడలు కూలిపోయాయి. అకస్మాత్తుగా చెట్టు మిద్దెపై పడటంతో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మిద్దెపై పడి ఉన్న చెట్టును మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
విజయనగరం: ఈనెల 28న ఎస్.కోట మండలం సంతగైరమ్మపేటలో చలుమూరి కుమారి ఇంటిలో పట్టపగలు దొంగతనం జరిగింది. పట్టణ సీఐ వి.నారాయణమూర్తి కేసు నమోదు చేశారు. తనదైన శైలిలో విచారణ చేయగా నిందితుడు ఎస్.కోట రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడినట్లు తెలిపారు. దొంగతనం జరిగిన ఒకరోజులోనే చేధించడంతో జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అభినందించి నగదు, ప్రశంస పత్రం అందజేశారు.
NTR: హైవేపై టోల్ ప్లాజాల వద్ద ఉన్న టాయిలెట్స్ శుభ్రంగా లేకపోతే ఫోటో తీసి పంపాలని NHAI ప్రజలను సూచించింది. క్లీన్ టాయిలెట్ ఎక్స్పీరియన్స్ ఛాలెంజ్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాజ్మార్గ యాత్ర యాప్‌లో జియో ట్యాగింగ్ ఆధారంగా ఉన్న టాయిలెట్ ఫోటోను అప్లోడ్ చేయాలన్నారు. అర్హత సాధించిన వారికి రూ.1,000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ ఇస్తామన్నారు.
అన్నమయ్య: గాలివీడు మండలం అరవీడు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను గాలివీడు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కడప: జిల్లా పోలీసు సిబ్బందికి హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల మెడిటేషన్ శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా, ప్రాణాయామం, ధ్యాన సాధనపై శిక్షణ అందించారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పెరిగి విధి నిర్వహణలో సమర్థత పెరుగుతుందని అధికారులు తెలిపారు.
TPT: తిరుమలలో భక్తుల భద్రత, పవిత్రత పరిరక్షణ లక్ష్యంగా ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. అలిపిరి నడక మార్గంలో 62 షాపులను తనిఖీ చేయగా, గుర్తింపు పత్రాలు లేని 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లైసెన్సులు లేని 8 షాపులను గుర్తించడంతో పాటు 34 మంది వేలిముద్రలను తనిఖీ చేశారు.
CTR: ప్రతి ఓటు విలువైందని, దాని ప్రాధాన్యతను గుర్తించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్ఏల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.