KDP: కడప నగరపాలక సంస్థ కమిషనర్ గురువారం నగరంలో పర్యటించారు. బుగ్గవంకలో ప్రజలు నేరుగా చెత్త వేయకుండా బ్రిడ్జిలపై ఫెన్సింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని పబ్లిక్ టాయిలెట్లను తనిఖీ చేసి, వాటి నిర్వహణ, పరిశుభ్రతను పరిశీలించారు. టాయిలెట్లను నిత్యం శుభ్రంగా ఉంచాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
KRNL: దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని దళిత సంఘాల నాయకులు కేంద్రాన్ని ఇవాళ కోరారు. ఎమ్మిగనూరులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నిర్ణయం దళితుల హక్కులకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.
NDL: మిడుతూరులో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై గ్రామస్థుల విజ్ఞప్తితో కలెక్టర్ రాజకుమారి ఇవాళ ప్రాంతాలను పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పనులు చేపట్టి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడంలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. సమస్యలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
W.G: భీమవరం (M) యనమదుర్రులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యేను రైతులు వరి కంకులతో ఘనంగా సత్కరించారు.
KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కూరగాయల మార్కెట్ వేలం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు స్థానిక మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి గురువారం తెలిపారు. కూరగాయల మార్కెట్‌తో పాటు, మాంసం చేపల మార్కెట్, వాహనాల పార్కింగ్కు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ ఫీజుల పెంపుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో సోమవారం నిర్వహించాల్సిన వేలం వాయిదా పడింది.
KRNL: ఎండాకాలంలో కుక్క కాట్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆస్పరిలో డాక్టర్ బాలకృష్ణారెడ్డి సూచించారు. అధిక వేడి వల్ల కుక్కలు దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు నీటితో శుభ్రంగా కడగాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స పొందాలన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామం చెర్ల ఎస్.టి. సంఘంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇంటిపైన సోలార్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని పేర్కొన్నారు. అర్హులై ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
SKLM: సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో గురువారం ముమ్మరంగా వివిధ రకాల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఉమాపతి, ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రానికి చెందిన సూపర్‌వైజర్ సంపతిరావు మోహనరావులు బాటిల్స్‌పై ఉన్న గడువుతేదీలు, బ్యాచ్ నెంబర్లు పరిశీలించారు. శ్రీకాకుళం మండలంలో ఇటీవల ఎక్స్‌పైర్ అయిన బాదంమిల్క్ తాగి సుమారు 90 మంది డయేరియాకు గురయ్యారు.
ఎన్టీఆర్: విజయవాడ మేధా టవర్స్‌లో దేశంలోనే మొదటి క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్ల తయారీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14న సీఎం చంద్రబాబు ఆ కార్యకలాపాలను ప్రారంభించనుండగా.. ఈ క్వాంటం కంప్యూటర్‌ను క్యుబిటెక్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. రానున్న రోజులలో క్వాంటం హార్డ్‌వేర్, పరిశోధనలకు ఈ టెస్ట్ బెడ్లు విస్తృతంగా ఉపయోగించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రకాశం: కొండపి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా గురువారం త్యాగరాజు బాధ్యతలుచేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతలకు విగాతం కలగకుండా చూస్తానన్నారు. ప్రధానంగా మత్తు పదార్థాలు, పేకాటపై దృష్టి సారిస్తానన్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కృష్ణా: మచిలీపట్నం మండలం లక్ష్మీపురం గ్రామంలో మంత్రి కొల్లు రవీంద్ర గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు పాడైపోవడంతో మంత్రి ఆసహనం వ్యక్తం చేశారు. శానిటేషన్ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. గ్రామంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
పల్నాడు: జిల్లాలో పిల్లలకు నాణ్యమైన పోషణ, ప్రాథమిక విద్యను అందించేందుకు పోషణ పఖ్వాడా కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్తా అన్నారు. గురువారం అమరావతిలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పోషణ పఖ్వాడా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 9 నుండి 23 వరకు పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించాలన్నారు.
విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ‘మినీ బాలోత్సవం’ పోస్టర్ ఆవిష్కరించారు. ఆసరా ఛారిటబుల్ సొసైటీ, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్తంగా ఏప్రిల్ 27న ఈ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు చిత్రలేఖనం, నృత్యం, నాటికలు, క్విజ్ పోటీలు ఉంటాయని వారు పేర్కొన్నారు. పాల్గొనేవారికి సర్టిఫికెట్లు, విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
Akp: కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి అధిక స్థానాలు సాధ్యమవుతాయని యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. పదవీకాలం పూర్తి చేసిన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
ATP: గుమ్మగట్ట మండలం తాళ్లకేర గ్రామంలో జరిగిన మరెమ్మ దేవి జాతర ఉత్సవాల్లో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మండల నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఇలాంటి ఉత్సవాలు ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలని పేర్కొన్నారు.