ATP: పెద్దవడుగూరు మండలం చిట్టూరు గ్రామ సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ… ఎలాంటి అనుమతి లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లపై కేసు నమోదు చేశామన్నారు.
తూ.గో జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కార వేదిక జూన్ 1వ తేదీన సోమవారం జిల్లా వ్యాప్తంగా యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
W.G: కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు విరాళం అందించినట్లు దేవస్థానం ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు. ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామానికి చెందిన కీ.శే. వేగేశ్న అప్పలరాజు జ్ఞాపకార్ధం భార్య నాగమణి, కుమారులు బాపిరాజు, గోపాలకృష్ణంరాజు, ప్రసాదరాజు రూ.3 లక్షలు అందించారని ఈవో తెలిపారు.
ELR: కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ జూన్ 1 నుంచి 8 వరకు ఏలూరు జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఏలూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, కేజీ బేసిన్ గ్యాస్‌లో 50 శాతం రాష్ట్రానికి కేటాయించాలన్నారు.
కడప శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, నవకలశ స్నపనం, చండీహోమం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 108 దీపాలతో దీపాలంకార సేవ, రాత్రి అమ్మవారి పల్లకీ సేవ వైభవంగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ATP: ప్రజారోగ్యం, రైతుల భద్రత దృష్ట్యా పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ అనే గడ్డి మందును 60 రోజులు నిషేధించినట్లు ఏడీఏ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని పలు దుకాణాలను తనిఖీ చేసి 7,694 లీటర్ల నిషేధిత మందును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందు నిల్వ ఉంచినా, అమ్మినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
NTR: NH-65 జాతీయ రహదారి నుంచి ఈడుపుగల్లు మెయిన్ రోడ్(పంటకాల్వ రహదారి) విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకై ఆసక్తి కల గుత్తేదారుల నుంచి APCRDA తాజాగా టెండర్లు ఆహ్వానించింది. గుత్తేదారులు పనుల వివరాలకై వెబ్‌సైట్‌లో చూడాలని, టెండర్ దాఖలుకు జూన్ 6 ఆఖరు తేదీ అని CRDA కమిషనర్ వి. విజయ తెలిపారు.
అన్నమయ్య: విశాఖపట్నం గాజువాకలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద స్థలాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ప్రమాద కారణాలపై అధికారులతో ఆరా తీసిన మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు,RTC జోన్-1 ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు అగ్రహారానికి చెందిన వెంకట సాయి దీపక్ ట్రేడింగ్‌లో లాభాల పేరట మోసపోయానంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. ఎస్సై రామకృష్ణ వివరాల మేరకు.. హైదరాబాదులోని ఓ కంపెనీలో తన తోటి ఉద్యోగిగా పనిచేస్తున్న సాయి ప్రవీణ్‌కు గత ఏడాది పలు దఫాలుగా రూ. 6.64 లక్షల సొమ్మును వెంకట సాయి ఇచ్చాడన్నారు. 6 నెలలు గడుస్తున్నా లాభాలు ఇవ్వలేదని తెలిపారు.
TPT: పిచ్చాటూరు ఎంపీడీవో కార్యాలయంలో జూన్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తహసీల్దార్ చంద్రబాబు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ వేదికలో మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొంటారని తెలిపారు. సమస్యలు ఉన్నవారు ఆయా శాఖల అధికారులకు ఫిర్యాదులు అందించి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
CTR: పుంగనూరు AMC యార్డులో ఆదివారం తీవ్ర ఉధృతి నెలకొంది. శనివారం రాత్రి వాహనాలు అడ్డు ఉన్నాయని లారీ డ్రైవర్ రామసముద్రం మండలానికి చెందిన టమోటా రైతు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో లారీ డ్రైవర్ రైతును గాయపరిచాడు. విషయం తెలుసుకున్న రైతులు మార్కెట్ యార్డ్ వద్ద నిరసన తెలిపారు. ఛైర్మన్ సమితి యాదవ్, సీఐ సుబ్బరాయుడు జోక్యంతో నిరసన విరమింప చేశారు.
KKD: శంఖవరం మండలం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతీ ఆదివారం జరిగే రథోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు స్వయంగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. వీకెండ్ కావడంతో రత్నగిరి క్షేత్రానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు రధోత్సవ సేవను తిలకించి పునీతులయ్యారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NTR: కంచికచర్ల శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పుస్తక పఠనం నిర్వహించి, కథలు చదివించి చెప్పించారు. డాన్స్ మాస్టర్ చైతన్య నృత్య కళల్లో శిక్షణ ఇవ్వగా విద్యార్థులు ఆసక్తిగా సాధన చేశారు. కంప్యూటర్ ద్వారా నీతికథలు విన్నారు. క్యారం బోర్డు, చెస్, లూడో వంటి ఆటలు ఆడించారు.
కడప జిల్లా మైదుకూరు మండలం నర్సోజీ కొట్టాల గ్రామంలో ఆదివారం గంగ జాతర వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుని సందడిగా మారింది. స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు కూడా జాతరలో పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లె మండలంలోని మాలేపాడులో ఆదివారం టీడీపీకి చెందిన మధుకర్ రెడ్డి, జాఫర్ బాష వర్గాల మధ్య దారి, భూ వివాదాల కారణంగా ఘర్షణ చోటుచేసుకుంది. గతంలో పంటల విషయంలో అడ్డుపడటం, ప్రస్తుతం రహదారిని మూసివేయడం వంటి కారణాలతో ఇరువర్గాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.