మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు విచారణ చేశారు. మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని.. సీబీఐ విచారణకు సహకరిస్తానని అవినాశ్ తెలిపారు. అధికారులకు ఉన్న అనుమానాలకు సమాధానం ఇచ్చానని.. వీడియో, ఆడియోకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. తదుపరి విచారణ కోసం మళ్లీ పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలో ఇచ్చిన 160 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వడంతో అనినాశ్ రెడ్డి కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరయ్యా. విచారణ పారదర్శకంగా జరుగాలని సీబీఐని కోరా. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చా. అధికారులకు ఉన్న అనుమానాలను నా సమాధానాలతో వివరణ ఇచ్చా. మళ్లీ ఎప్పుడు విచారణకు రావాలని కోరినా వస్తానని చెప్పా. ప్రజలకు కేసుకు సంబంధించిన వివరాలు తెలియాలని వీడియో, ఆడియోకు అనుమతి కోరగా అధికారులు అంగీకరించలేదు. నాలుగున్నర గంటల పాటు నన్ను విచారణ చేశారు. విచారణకు సంబంధించిన విషయాలు ఏవీ ప్రస్తుతం బహిర్గతం చేయలేను. కొన్ని మీడియా సంస్థలు పని గట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నాయి’ అని అనినాశ్ రెడ్డి తెలిపాడు.
అయితే తదుపరి విచారణ కోసం మరోసారి అవినాశ్ రెడ్డిని పిలిచే అవకాశం ఉంది. ఉన్నత అధికారులతో చర్చించిన అనంతరం మరోసారి అవినాశ్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. విచారణ జరిగిన తీరును వెంటనే సీఎం జగన్ కు అవినాశ్ నివేదించే అవకాశం ఉంది. తదుపరి సీబీఐ అడుగులు ఎలా ఉంటాయోనని ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరంగా మారింది.