తనను ప్రేమించాలంటూ ఓ యువతిని వేదించ సాగాడో యువకుడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. తర్వాత పొడుచుకుని అతడూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇప్పుడు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.
Man Brutally killed Young Woman : ప్రేమ పేరుతో జరిగే అఘాయిత్యాలను మనం రోజు రోజూ వింటూనే ఉంటున్నాం. ఇలాంటి అరాచక ఘటన ఒకటి ఏలూరులో చోటు చేసుకుంది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. ఈ ఘటన ఏలూరులోని ఎమ్మార్సీ కాలనీలో చోటు చేసుకుంది. గత కొంత కాలంగా రత్న గ్రేస్ అనే యువతిని ఏసురత్నం అనే యువకుడు ప్రేమ( Love) పేరుతో వేదించసాగాడు. తనను ప్రేమించాలంటూ వెంట పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం యువతి ఇంటి దగ్గరలో ఉంది. అప్పుడు ఆమె వద్దకు వచ్చిన ఏసు రత్నం తన ప్రేమను ఒప్పుకోవాలంటూ అడిగాడు. అందుకు ఆమె ససేమిరా అంగీకరించలేదు.
దీంతో కోపోద్రిక్తుడైన ఏసు రత్నం తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటకు తీశాడు. ఆమె మెడపై పలు మార్లు కోసి గాయపరిచాడు. దీంతో గ్రేస్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత అదే కత్తితో ఏసురత్నం సైతం పొడుచుకుని ఆత్మ హత్యా యత్నం చేసుకున్నాడు. తర్వాత కొట్టుమిట్టాడుతున్న అతడిని పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. అతడిని బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.